అడ్డుగోడలా..: జైస్వాల్‌, జడ్డూలపై సచిన్‌ ఫైర్‌!.. పోస్ట్‌ వైరల్‌ | Tendulkar Slams Indian Fielders Jaiswal These Deny Bumrah 9 Wickets | Sakshi
Sakshi News home page

జైస్వాల్‌, జడ్డూలపై సచిన్‌ విమర్శలు.. పాపం బుమ్రా!.. పోస్ట్‌ వైరల్‌

Jun 23 2025 1:37 PM | Updated on Jun 23 2025 3:08 PM

Tendulkar Slams Indian Fielders Jaiswal These Deny Bumrah 9 Wickets

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. లీడ్స్‌ వేదికగా ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఈ పేస్‌ గుర్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా స్టోక్స్‌ బృందాన్ని 465 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి బౌలింగ్‌ విభాగం భారమంతా తన భుజాలపైనే వేసుకుని ముందుకు నడిపించాడు.

అయితే, మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు అంతగా సహకారం లభించలేదు. మరోవైపు.. ఫీల్డర్ల తప్పిదాల కారణంగా బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఇచ్చిన దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. శనివారం నాటి రెండో రోజు ఆటలో మూడు.. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.

క్యాచ్‌లు నేలపాలు చేసిన జైసూ, జడ్డూ
ముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (62), వన్‌డౌన్‌ బ్యాటర్‌, శతక వీరుడు ఓలీ పోప్‌ (106), మరో కీలక బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (99) ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మరోవైపు.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా బుమ్రా బౌలింగ్‌లో డకెట్‌ క్యాచ్‌ను జారవిడిచాడు. 

ఇదిలా ఉంటే.. బ్రూక్‌ను బుమ్రా డకౌట్‌ చేశాడని భావించగా.. అది నో బాల్‌గా తేలడం.. ఆ తర్వాత బ్రూక్‌ శతకానికి సమీపించడం జరిగాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ జస్‌‍ప్రీత్‌ బుమ్రాను ప్రశంసిస్తూనే.. భారత ఫీల్డర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ ట్వీట్‌ చేశాడు. 

జైస్వాల్‌, జడ్డూలపై సచిన్‌ ఫైర్‌!
‘‘బుమ్రాకు శుభాకాంక్షలు!.. ఒక నో బాల్‌.. మూడు జారవిడిచిన క్యాచ్‌లు నీకూ.. తొమ్మిది వికెట్లకు మధ్య అడ్డుగోడలా నిలిచాయి’’ అని పేర్కొన్నాడు.

జైసూ, జడ్డూ ఫీల్డింగ్‌ తప్పిదాలతో, బ్రుక్‌కు వేసిన బంతి నో బాల్‌గా తేలనట్లయితే బుమ్రా ఖాతాలో మరో నాలుగు వికెట్లు చేరేవని.. తద్వారా అతడు తొమ్మిది వికెట్లు తీసేవాడని సచిన్‌ టెండుల్కర్‌ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. 

ఎవరి వికెట్లు తీశాడంటే?
కాగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బుమ్రా 24.4 ఓవర్ల బౌలింగ్‌లో 83 పరుగులు (3.40 ఎకానమీ) ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్‌ ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బుమ్రా.. జాక్‌ క్రాలే (4), బెన్‌ డకెట్‌ (62), జో రూట్‌ (28), క్రిస్‌ వోక్స్‌(38), జోష్‌ టంగ్‌ (11) వికెట్లు పడగొట్టాడు. ఇందులో డకెట్‌తో పాటు.. వోక్స్‌, టంగ్‌లను బుమ్రా బౌల్డ్‌ చేశాడు.

ఇక భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ను గతంలో పటౌడీ ట్రోఫీ అని పిలిచేవారన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సిరీస్‌ నుంచి దీనికి టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేసింది ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు. 

ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో టీమిండియా- ఇంగ్లండ్‌కు ఇదే తొలి సిరీస్‌ కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్‌తోనే భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణం ఆరంభించాడు.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి టెస్టు (జూన్‌ 20-24)
🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్‌
🏏టాస్‌: ఇంగ్లండ్‌.. తొలుత బౌలింగ్‌
🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 471 ఆలౌట్‌ (జైస్వాల్‌ (101), గిల్‌ (147), రిషభ్‌ పంత్‌ (134) శతకాలు)
🏏ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465 ఆలౌట్‌ (ఓలీ పోప్‌ (106) శతకం)
🏏ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి: టీమిండియా స్కోరు: 90/2 (23.5).. 96 పరుగుల ఆధిక్యం.

చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్‌
 

Advertisement
 
Advertisement
Advertisement