
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్‌ల టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఈ సిరీస్‌లో ఏళ్ల నాటి రికార్డులు తిరగరాయబడ్డాయి. కొన్ని విభాగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పబడ్డాయి. ఐదో టెస్ట్‌లో రికార్డుల పరంపర తారాస్థాయికి చేరింది.
ఈ మ్యాచ్ నాలుగో రోజు సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఈ సిరీస్‌లో ఏకంగా 9 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సిరీస్‌లోనూ ఇంత మంది 400 ప్లస్ పరుగులు చేయలేదు.
ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 754 పరుగులు చేశాడు. గిల్ తర్వాత జో రూట్ (537), కేఎల్ రాహుల్ (532), రవీంద్ర జడేజా (516), హ్యారీ బ్రూక్ (481), రిషబ్ పంత్ (479), బెన్ డకెట్ (462), జేమీ స్మిత్ (434), యశస్వి జైస్వాల్ (411) 400 ప్లస్ పరుగులు చేశారు.
గతంలో ఇలా..!
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 1975-76 సిరీస్‌లో ఇరు జట్లకు చెందిన 8 మంది బ్యాటర్లు 400 ప్లస్ పరుగులు చేశారు. ఆతర్వాత 1993 యాషెస్ సిరీస్‌లోనూ ఇదే ఫీట్ రిపైటైంది. అయితే 9 మంది 400 ప్లస్ పరుగులు నమోదు చేయడం మాత్రం ఇదే మొదటిసారి.
భారత క్రికెట్ చరిత్రలోనూ ఇదే మొదటిసారి
ఈ సిరీస్‌లో ఏకంగా ముగ్గురు భారత బ్యాటర్లు (గిల్, రాహుల్, జడేజా) 500 ప్లస్ పరుగులు చేయడం మరో విశేషం. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఫీట్ నమోదు కాలేదు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.
374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. జేమీ ఓవర్టన్ (0), జేమీ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. 1, 3 టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో టెస్ట్ గెలిచింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది.
స్కోర్ వివరాలు..
భారత్ 224 & 396
ఇంగ్లండ్ 247 & 339/6 (76.2)