విశాఖలో విజయగర్జన

Team India Won By 48 Runs In 3rd T20 Against South Africa - Sakshi

మూడో టి20లో 48 పరుగులతో భారత్‌ జయభేరి

చెలరేగిన రుతురాజ్, ఇషాన్‌

తిప్పేసిన చహల్‌

పడగొట్టిన హర్షల్‌

సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌ తీరం ఎట్టకేలకు టీమిండియాను విజయతీరానికి చేర్చింది. ఓపెనింగ్‌ హిట్టయినా... మిడిలార్డర్‌ నిరాశపరిచింది. అయితే బౌలింగ్‌ కూడా సూపర్‌ హిట్‌ కావడంతో భారత్‌ వరుస పరాజయాలకు బ్రేక్‌ పడింది. మూడో టి20లో టీమిండియా 48 పరుగులతో దక్షిణాఫ్రికాపై గెలిచి సిరీస్‌లో 1–2తో నిలబడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

రుతురాజ్‌ గైక్వాడ్‌ (35 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్‌ (29; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. హర్షల్‌ పటేల్‌ (4/25) నిప్పులు చెరగగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యజువేంద్ర చహల్‌ (3/20; రెండు క్యాచ్‌లు) తిప్పేశాడు. ఈనెల 17న రాజ్‌కోట్‌లో నాలుగో టి20 జరుగుతుంది. 

రుతురాజ్‌ తుఫాన్‌ 
ఓపెనర్లు రుతురాజ్, కిషన్‌ బ్యాటింగ్‌ తుఫాన్‌కు శ్రీకారం చుట్టారు. రబడ వేసిన మూడో ఓవర్లో 4, 6 కొట్టిన రుతురాజ్‌... నోర్జే వేసిన ఐదో ఓవర్‌ను ఫోర్లతో చితగ్గొట్టేశాడు. వరుస 4, 4, 4, 4, 4, 0లతో 20 పరుగులొచ్చాయి. పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు 57/0. ఐదో ఓవర్‌ నుంచి రన్‌రేట్‌ 9కు దిగలేదు. రుతురాజ్‌ 30 బంతుల్లోనే (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు.

మరోవైపు ఇషాన్‌ కూడా అడపాదడపా భారీ షాట్లు ఆడుతూ స్కోరు పెంచాడు. షమ్సీ తొమ్మిదో ఓవర్లో ఒక సిక్స్, ఫోర్‌ బాదాడు. పదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన కేశవ్‌ మహరాజ్‌ తన తొలిఓవర్లోనే భారత సునామీ ఆరంభాన్ని దెబ్బతీశాడు. రుతురాజ్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 97 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 

తర్వాత వికెట్ల విలవిల 
ఓపెనర్ల దూకుడుతో కనీసం 200 పైచిలుకు స్కోరు గ్యారంటీ అనిపించింది. అయితే సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో భారత బ్యాటర్స్‌ పట్టు సడలించారు. ఇషాన్‌ 31 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తయ్యాక వరుస ఓవర్లలో మొదట శ్రేయస్‌ అయ్యర్‌ (14), తర్వాత ఇషాన్‌ ఔటయ్యారు. అనంతరం వచ్చిన హిట్టర్లు పంత్‌ (6), దినేశ్‌ కార్తీక్‌ (6) చేతులెత్తేశారు. çహార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు) కొట్టిన ఫోర్లతో స్కోరు 179 పరుగులకు చేరింది. 

సఫారీ కుదేల్‌ 
దక్షిణాఫ్రికా గత మ్యాచ్‌ల జోరుకు 180 పరుగుల లక్ష్యం ఏమంత కష్టం కానేకాదు. కానీ భారత బౌలర్ల పట్టుదలకు క్రీజులోకి వచ్చిన 11 మందిలో ఏ ఒక్కరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. పవర్‌ ప్లేలోనే సఫారీ ఓపెనర్లు బవుమా (8), హెండ్రిక్స్‌ (23) పెవిలియన్‌ చేరారు. తర్వాత వచ్చిన ప్రిటోరియస్‌ (20), డసెన్‌ (3), క్లాసెన్‌లకు చహల్‌ స్పిన్‌ ఉచ్చు బిగించాడు. మరోవైపు హర్షల్‌ నిప్పులు చెరగడంతో దక్షిణాఫ్రికా 100 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. మిల్లర్‌ (3), క్లాసెన్‌ అవుటయ్యాక సఫారీ విజయానికి దూరమైంది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి అండ్‌ బి) కేశవ్‌ 57; ఇషాన్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) ప్రిటోరియస్‌ 54; శ్రేయస్‌ (సి) నోర్జే (బి) షమ్సీ 14; పంత్‌ (సి) బవుమా (బి) ప్రిటోరియస్‌ 6; హార్దిక్‌ (నాటౌట్‌) 31; దినేశ్‌ కార్తీక్‌ (సి) పార్నెల్‌ (బి) రబడ 6; అక్షర్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–97, 2–128, 3–131, 4–143, 5–158. బౌలింగ్‌: రబడ 4–0–31–1, పార్నెల్‌ 4–0–32–0, నోర్జే 2–0–23–0, ప్రిటోరియస్‌ 4–0–29–2, షమ్సీ 4–0–36–1, కేశవ్‌ 2–0–24–1.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: బవుమా (సి) అవేశ్‌ (బి) అక్షర్‌ 8; హెండ్రిక్స్‌ (సి) చహల్‌ (బి) హర్షల్‌ 23; ప్రిటోరియస్‌ (సి) పంత్‌ (బి) చహల్‌ 20; డసెన్‌ (సి) పంత్‌ (బి) చహల్‌ 1; క్లాసెన్‌ (సి) అక్షర్‌ (బి) చహల్‌ 29; మిల్లర్‌ (సి) రుతురాజ్‌ (బి) హర్షల్‌ 3; పార్నెల్‌ (నాటౌట్‌) 22; రబడ (సి) చహల్‌ (బి) హర్షల్‌ 9; కేశవ్‌ (సి) కార్తీక్‌ (బి) భువనేశ్వర్‌ 11; నోర్జే రనౌట్‌ 0; షమ్సీ (సి) అవేశ్‌ ఖాన్‌ (బి) హర్షల్‌  పటేల్‌ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 131. వికెట్ల పతనం: 1–23, 2–38, 3–40, 4–57, 5–71, 6–100, 7–113, 8–126, 9–131, 10–131. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–21–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–35–0, అక్షర్‌  పటేల్‌ 4–0–28–1, చహల్‌ 4–0–20–3, హర్షల్‌ పటేల్‌ 3.1–0–25–4.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top