IND Vs AUS: తప్పులే ఎక్కువగా.. ఎదురుదెబ్బ తగలాల్సిందే!

Team India Made-Huge-Mistakes Cost Match Lost Vs AUS 3rd Test - Sakshi

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియాల మధ్య మూడో టెస్టు ముగిసింది. 76 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి చేధించింది. తద్వారా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో బెర్తు ఖరారు చేసుకుంది. అయితే టీమిండియా ఓటమిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని ఆసీస్‌ మీడియా తమ కథనంలో ప్రచురించగా.. టీమిండియా అభిమానులు మాత్రం ఎదురుదెబ్బ తగిలితేనే మంచిదని పేర్కొన్నారు. ఒకసారి ఓడిపోతేనే మనలో లోపాలు బయపడుతాయని.. తర్వాతి మ్యాచ్‌లో వాటిని సరిచేసేందుకు ప్రయత్నించాలని తెలిపారు.

అయితే మ్యాచ్‌లో టీమిండియా తప్పులే ఎక్కువగా ఉన్నాయి. టాస్‌ గెలవడం దగ్గరి నుంచి టీమిండియా బ్యాటింగ్‌ వరకు అన్ని లోపాలే. ఇక బౌలింగ్‌లో మన ప్రదర్శన సూపర్‌గా ఉన్నా నోబాల్స్‌ అంశం మింగుడుపడనివ్వడం లేదు. జడేజా, సిరాజ్‌లు పోటీపడి మరి నో బాల్స్‌ వేయడం భారత్‌ కొంపముంచింది.

రెండో ఇన్నింగ్స్‌లో లబుషేన్‌ సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడే జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కానీ అది నోబాల్‌ కావడంతో అతను బతికిపోయాడు. ఆ తర్వాత కూడా జడ్డూ నోబాల్స్‌ బాగానే వేశాడు. ఇక సిరాజ్‌ను కూడా నోబాల్స్‌ బెడద వదల్లేదు. ఐదు నోబాల్స్‌ సహా మొత్తం 22 పరుగులు ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి. బౌలింగ్‌ సంగతి పక్కనబెడితే బ్యాటింగ్‌లో చాలా లోపాలు బయటపడ్డాయి.

తొలి రెండు టెస్టుల్లోనూ టీమిండియా బ్యాటింగ్‌ గొప్పగా ఉందని చెప్పలేము.. అయితే ముందు రెండు టెస్టులతో పోలిస్తే మూడో టెస్టులో మన బ్యాటింగ్‌ మరింత నాసిరకంగా తయారైంది. స్పిన్నర్లను అవలీలగా ఎదుర్కొనే కోహ్లి, అయ్యర్‌ లాంటి బ్యాటర్లు చేతులెత్తేశారు. వన్డేల్లో వరుసబెట్టి సెంచరీలు చేసిన కోహ్లి బ్యాట్‌ మూగబోయింది. ఇక సూర్య స్థానంలో వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ మునుపటి ఫామ్‌ను ప్రదర్శించలేకపోతున్నాడు.

తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన రోహిత్‌ ఆట మళ్లీ మొదటికే వచ్చింది. ఇక​ కేఎల్‌ రాహుల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ ఏమాత్రం ఆకట్టులేకపోయాడు. పుజారా ఒక్కడే కాస్త మెరుగ్గా కనిపించాడు. ఇక జడేజా రీఎంట్రీ తర్వాత తొలిసారి విఫలం కాగా.. శ్రీకర్‌ భరత్‌ కీపర్‌గా బెస్ట్‌ అనిపిస్తున్నా బ్యాటింగ్‌ ప్రదర్శన అంతంతమాత్రమే. ఇక అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు కీలక సమయాల్లో బ్యాట్‌తో రాణించలేకపోతున్నారు.

ఆసీస్‌తో మూడో టెస్టు ఓటమి మనకు ఒక గుణపాఠం. ఒక రకంగా టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలితేనే మంచింది. ఓటమి ఎదురైనప్పుడే మనలో లోపాలు బయటకు వస్తాయి. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు దక్కించుకోవాలంటే అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో టీమిండియా గెలవాల్సిందే. 

చదవండి: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్‌ చర్యకు మైండ్‌బ్లాక్‌

అదే రెండున్నర రోజులు.. సీన్‌ మాత్రం రివర్స్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top