రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఏడు వికెట్లు కోల్పోయి 99 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన త్రిపుర మరో 21 పరుగులు జతచేసి 120 స్కోరు వద్ద ఆలౌటైంది. వికెట్ కీపర్ సెంతూ సర్కార్ (27) టాప్ స్కోరర్‌గా నిలవగా, శ్రీదమ్ పాల్ (25) పర్వాలేదనిపించాడు.
హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఆరు వికెట్లతో త్రిపుర పతాన్ని శాసించగా, కెప్టెన్ సిరాజ్ 2 వికెట్లు తీయగా, రుతిక్ యాదవ్, అభిరథ్ రెడ్డిలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 160 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది.
ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (122 బంతుల్లో 54; 2 ఫోర్లు)... ఈ మ్యాచ్‌తో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మహబూబ్‌నగర్ జిల్లా ప్లేయర్ మెండె రుతిక్ యాదవ్ (150 బంతుల్లో 61; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రాహుల్ రాదేశ్ (119 బంతుల్లో 40; 1 ఫోర్)తో కలిసి రుతిక్ యాదవ్ ఆరో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో చామా మిలింద్ (55 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
త్రిపుర కెప్టెన్ మణిశంకర్ మూరా సింగ్ ఏకంగా తొమ్మిది మందితో బౌలింగ్ వేయించగా... ఆఫ్ స్పిన్నర్ సందీప్ సర్కార్ 96 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇక త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ బిక్రమ్‌కుమార్ (50) అర్థసెంచరీ చేశాడు.
హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 5 వికెట్లు తీయగా, తనయ్ త్యాగరాజన్ మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన తనయ్ త్యాగరాజన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. హైదరాబాద్ తమ తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 18 నుంచి ఆంధ్ర జట్టుతో ఆడనుంది.
ఇదీ చదవండి:


