స్వర్ణపతకం సాధించిన కొన్ని క్షణాల్లోనే తండ్రి మృతి.. విలవిల్లాడిన లోకప్రియ

Tamil Nadu player Lokapriya father died of Sudden Heart Attack - Sakshi

సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): న్యూజిలాండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో పట్టుకోట్టైకి చెందిన క్రీడాకారిణి స్వర్ణం సాధించిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న క్రీడాకారిణి శోకసంద్రం అయింది. తంజావూరు జిల్లా పట్టుకోట్టై అన్నానగర్‌కు చెందిన పెయింటర్‌ సెల్వముత్తు (50) భార్య రీటా మేరీ (42)కి ముగ్గురు కుమార్తెలు లోకప్రియ (22), ప్రియదర్శిని (19), ప్రియాంక (14).

ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ అయిన లోకప్రియ చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తితో ఆసియా, రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. న్యూజిలాండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన లోకప్రియ 52 కిలోల జూనియర్‌ విభాగంలో 350 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని గెలుచుకుంది. న్యూజిలాండ్‌లో నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఈ మ్యాచ్‌ జరిగింది.

చదవండి: (కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లి చేసుకొని..)

ఈ క్రమంలో లోకప్రియ తండ్రి సెల్వముత్తు నిన్న రాత్రి 8 గంటల సమయంలో పుదుక్కోట జిల్లా కందర్వ కోట తాలూకా రన్‌పట్టి వద్ద గుండెపోటుతో మరణించారు. లోకప్రియకు పోటీ ముగిసేవరకు చెప్పలేదు. పోటీ ముగిసిన అనంతరం స్వర్ణపతకం సాధించిన లోకప్రియకు తన తండ్రి మరణవార్తను వీడియో కాల్‌లో తెలిపారు. దీంతో లోకప్రియ వీడియో కాల్‌లోనే తండ్రి మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ గోల్డ్‌మెడల్‌ గెలిచిన ఆనందం ఐదు నిమిషాలు కూడా నిలవలేదన్నారు. తాను న్యూజిలాండ్‌కు వెళ్తున్న విషయం తన తండ్రికి చెప్పలేదని, పతకం సాధించాక వీడియో కాల్‌లో చూపించి తన ఆశీస్సులు పొందాలనుకున్నానని వాపోయింది. తనకు తండ్రి దూరం కావడం తీరని లోటని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు క్రీడాకోటాలో ఉపాధి కల్పిస్తే తన కుటుంబాన్ని కాపాడుకుంటానని చెప్పింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top