కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు.. 32 సిమ్‌ కార్డులు..

Eternal Bride cheat Four persons for Money in Tamil nadu - Sakshi

సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న నటరాజన్‌ (25) తాంబరం రంగనాథపురంలో ఉండేవాడు. ఆ సమయంలో ముడిచూరు రోడ్డులోని ఓ బేకరీలో పనిచేస్తున్న అభినయ(28)తో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సమయంలో అభినయ తన తల్లిదండ్రులతో గొడవపడి ఇక్కడే హాస్టల్‌లో ఒంటరిగా ఉంది.

ఈ క్రమంలో ఆగస్టు 29న రంగనాథపురం పెరుమాళ్‌ ఆలయంలో తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో అభినయను నటరాజన్‌ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత భార్యాభర్తలు రెండు వేర్వేరు నగల దుకాణాల్లో చేరారు. అభినయ ఒక్కరోజు మాత్రమే పనికి వెళ్లి ఆ తర్వాత వెళ్లలేదు. తరువాత అక్టోబర్‌ 19న అభినయ హఠాత్తుగా అదృశ్యమైంది. అతడి రెండు సెల్‌ఫోన్లు హ్యాక్‌ అయ్యాయి. ఇంట్లోని 17 తులాల నగలు, రూ.20 వేలు నగదు, కొత్త పట్టుచీరలతో పరారైంది. దీంతో నటరాజన్‌ తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (అప్పటికే నిశ్చితార్థం.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా.. షాపు ఓనర్‌తో కలిసి..)

అభినయ ఆధార్‌కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు మదురై సౌత్‌ అరిసికర స్ట్రీట్, సోనాథరువార్‌ టెంపుల్‌ అని రాసి ఉంది. ఈ నేపథ్యంలో అభినయ సెమ్మంచేరి యమమల్ల పురం సాలైలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హాస్టల్‌లో ఉన్న అభినయను పోలీసులు హుటాహుటిన అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి 4 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అభినయకు అప్పటికే వివాహమై భర్త, ఒక బిడ్డ కూడా ఉన్నాడని తెలిసింది.

అభినయ ప్లాన్‌ చేసి నటరాజన్‌ను ప్రేమిస్తున్నట్లు నటించి తన భర్త, బిడ్డ ఉన్న విషయం దాచిపెట్టి నగలు, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. అభినయ మరో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అభినయ పలువురు యువకులను పరిచయం చేసుకుని పెళ్లి పేరిట తంతు కానిచ్చి తరువాత డబ్బు, నగలతో ఉడాయిస్తున్నట్లు తెలిసింది. అభినయ సహచరుడిగా ఉన్న సెంథిల్‌కుమార్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top