ఐసీసీ సంచలన నిర్ణయం.. కరోనా వచ్చినా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడవచ్చు..!

T20 World Cup 2022: Players Testing Covid Positive Will Be Allowed To Play - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో పాల్గొనే జట్లకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) శుభవార్త చెప్పింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను ఎత్తివేయడంతో ఇకపై కోవిడ్‌ టెస్ట్‌లు, ఐసోలేషన్‌ తప్పనిసరి కాదని ఐసీసీ ఇవాళ ప్రకటించింది. దీంతో ఏ ఆటగాడైనా కోవిడ్‌ బారిన పడినా తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, జట్టు డాక్టర్‌ సమ్మతి మేరకు సదరు ఆటగాడు మ్యాచ్‌ ఆడితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది. 

కోవిడ్‌ విషయంలో ఐసీసీ ఈ వెసులుబాటు కల్పించడం పట్ల అన్ని జట్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఐసీసీ నిర్ణయాన్ని ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ స్వాగతించాడు. ఇకపై కోవిడ్‌ విషయంలో ఆటగాళ్లు, యాజమాన్యాలు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదని, ఆటగాళ్లు హాయిగా ఆటపై పూర్తి దృష్టి సారించవచ్చని అభిప్రాయపడ్డాడు. గత రెండేళ్లకాలంలో కోవిడ్‌ ఆటపై ఎలాంటి దుష్ప్రభావం చూపిందో అందరం చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. 

కాగా, ఈ ఏడాది జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్లో (స్వర్ణ పతకం కోసం జరిగిన మ్యాచ్‌) ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ తహ్లియ మెక్‌గ్రాత్‌ కోవిడ్‌ బారిన పడినా, మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. తహ్లియ కోవిడ్‌తో బాధపడుతుందని తెలిసినా ఆసీస్‌ యాజమాన్యం జట్టు ప్రయోజనాల కోసం ఆమెను బరిలోకి దించింది. తహ్లియ.. ఆసీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పెవిలియన్‌లో మాస్క్‌ ధరించి తనను తాను ఐసోలేట్‌ చేసుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.  

ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు నేటి నుంచే ప్రారంభం కాగా, వార్మప్‌ మ్యాచ్‌లు రేపటి నుంచి (అక్టోబర్‌ 17) ప్రారంభంకానున్నాయి. క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌లో పసికూన నమీబియా ఆసియా ఛాంపియన్‌ శ్రీలంకకు షాకిచ్చి మెగా టోర్నీని సంచలనంతో ప్రారంభించింది. ఇవాళే జరుగుతున్న మరో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో యూఏఈ-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. రేపు జరుగబోయే వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- భారత్‌ జట్లు తలపడనున్నాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top