వరల్డ్‌కప్‌లో భారీ సిక్సర్‌.. కండలు చూపించిన బ్యాటర్‌

T20 WC SL VS UAE: Junaid Siddique Flaunts His Biceps After Hitting Massive 109 Metres Six - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భారీ సిక్సర్‌ నమోదైంది. శ్రీలంకతో జరిగిన గ్రూప్‌-ఏ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో యూఏఈ ఆటగాడు జునైద్‌ సిద్ధిఖి ఈ ఘనత సాధించాడు. 10వ నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగిన అతను.. దుష్మంత చమీరా వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ రెండో బంతికి 109 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు. స్టంప్స్‌పైకి వచ్చిన బంతిని జునైద్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా స్టేడియం దాటించాడు. ఈ మాన్‌స్టర్‌ సిక్సర్‌ బాదిన అనంతరం జునైద్‌ సెలబ్రేట్‌ చేసుకున్న తీరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. జునైద్‌.. సిక్సర్‌ కొట్టగానే తన బలం ఇదంటూ కండలు చూపించాడు. 

ఇదిలా ఉంటే, జునైద్‌ సిక్సర్‌ బాదినప్పటికే యూఏఈ ఓటమి దాదాపుగా ఖరారైంది. శ్రీలంక నిర్ధేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లు హసరంగ (3/8), దుష్మంత చమీరా (315), మహీశ్‌ తీక్షణ (2/15), ప్రమోద్‌ మధుషన్‌ (1/14), దసున్‌ షనక (1/7).. యూఏఈ బ్యాటింగ్‌ లైనప్‌కు కకావికలం​ చేశారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగా.. ఇన్నింగ్స్‌ మొత్తంలో ఒకే ఒక సిక్సర్‌ నమోదైంది.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (60 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వ (33) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో కార్తీక్‌ మెయప్పన్‌ (3/19) హ్యాట్రిక్‌తో సత్తా చాటగా.. జహూర్‌ ఖాన్‌ 2, అఫ్జల్‌ ఖాన్‌, ఆర్యన్‌ లక్రా తలో వికెట్‌ పడగొట్టారు.     
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top