Asia Cup 2022: హనీమూన్‌ పీరియడ్‌ అయిపోయింది.. ద్రవిడ్‌కు కష్టకాలం: టీమిండియా మాజీ సెలక్టర్‌

T20 WC: Honeymoon Period Is Over Ex BCCI Selector on Coach Dravid Tenure - Sakshi

T20 World Cup 2022- Team India- Rahul Dravidఆసియా కప్‌-2022 టోర్నీలో డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా కనీసం ఫైనల్‌ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పొట్టి ఫార్మాట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతూ హాట్‌ ఫేవరెట్‌గా మెగా ఈవెంట్‌లో అడుగుపెట్టిన రోహిత్‌ సేన.. అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. జట్టు ఎంపిక మొదలు తుది జట్టు కూర్పు వరకు కొన్నిసార్లు మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాలు ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేశాయి.

వరుస విజయాలు.. కానీ అసలు పోరులో చేతులెత్తేశారు!
కాగా.. కెప్టెన్‌ రోహిత్‌.. హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి మెగా టోర్నీ ఇది. ఈ ఈవెంట్‌కు ముందు.. వీరిద్దరి నేతృత్వంలో టీమిండియా టీ20 ఫార్మాట్‌లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. వరుస విజయాలతో ప్రపంచ రికార్డులు సృష్టించింది. కానీ.. టీ20 ప్రపంచకప్‌-2022కు సన్నాహకంగా భావించిన ఆసియా కప్‌ ఈవెంట్లో మాత్రం చతికిలపడింది. 

ఇదిలా ఉంటే.. ఓవైపు దాయాది పాకిస్తాన్‌.. మరోవైపు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పొరుగు దేశం శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్‌ సబా కరీం.. టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

హనీమూన్‌ పీరియడ్‌ అయిపోయింది..
ఆసియా కప్‌లో టీమిండియా ప్రదర్శన ద్రవిడ్‌కు కష్టకాలం తెచ్చిపెట్టిందని.. భవిష్యత్తులో అతడు మరిన్ని కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందన్నాడు. అదే విధంగా రానున్న రెండు మెగా ఐసీసీ ఈవెంట్లలో గెలిస్తేనే కోచ్‌గా అతడికి సంతృప్తి దొరుకుతుందని పేర్కొన్నాడు.  ఈ మేరకు స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ.. ‘‘తన హనీమూన్‌ పీరియడ్‌ అయిపోయిందని రాహుల్‌ ద్రవిడ్‌కు తెలుసు. జట్టును అత్యుత్తమ స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.

అప్పుడే ద్రవిడ్‌కు సంతృప్తి
కానీ అతడి ప్రయత్నాలు అందుకు సరిపోవడం లేదు. నిజంగా రాహుల్‌ ద్రవిడ్‌కు ఇది కష్టకాలం. టీ20 వరల్డ్‌కప్‌, వన్డే వరల్డ్‌కప్‌ రూపంలో రెండు మెగా ఐసీసీ ఈవెంట్లు ముందున్నాయి. ఈ రెండు టోర్నీల్లో ఇండియా గెలిస్తేనే రాహుల్‌ ద్రవిడ్‌కు సంతృప్తి దొరుకుతుంది’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అదే విధంగా తన మార్గదర్శనంలో సెనా(SENA- సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో టీమిండియా టెస్టు సిరీస్‌లు గెలిస్తే ద్రవిడ్‌ సంతోషడతాడంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: రవీంద్ర జడేజాపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top