T20 WC 2022: సూర్యకుమార్‌ కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేశాడు.. !

T20 WC 2022: Wasim Jaffer States Suryakumar Yadav Could Not Live Up To Expectations In Big Games - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్లో టీమిండియా.. ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు తీవ్రంగా మనసు నొచ్చుకున్నారు. కొందరు బహిరంగంగా తమ బాధను వెల్లగక్కితే.. మరికొందరు పర్వాలేదులే అంటూ టీమిండియాను వెనకేసుకొచ్చారు. ఓటమి బాధను దిగమింగుకోలేక బాహాటంగా బాధను వ్యక్త పరిచిన వారిలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ కూడా ఉన్నాడు.

దాదాపుగా ప్రతి సందర్భంలో టీమిండియాను వెనకేసుకొచ్చే జాఫర్‌.. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి అనంతరం మాత్రం జట్టులో లోపాలను గట్టిగానే లేవనెత్తాడు. తొలుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వైఫల్యాలను ఘాటుగా విమర్శించిన జాఫర్‌.. ఆతర్వాత సెమీస్‌లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేనందుకు భారత బౌలర్లను ఎండగట్టాడు. తాజాగా అతను టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను కూడా టార్గెట్‌ చేశాడు.

ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ 3 అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించినప్పటికీ, కీలక మ్యాచ్‌ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడంటూ స్కైను వేలెత్తి చూపాడు. సెమీస్‌ మ్యాచ్‌కు ముందు వరకు టీమిండియాపై పేలిన పాక్‌ మాజీలకు, ఇంగ్లండ్‌ మాజీలకు స్ట్రాంగ్‌ కౌంటర్లిచ్చిన జాఫర్‌ ఒక్కసారిగా ఇలా భారత ఆటగాళ్లను టార్గెట్‌ చేయడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జాఫర్‌కు ఏమైనా చిప్‌ దొబ్బందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రోహిత్‌ను టార్గెట్‌ చేసినప్పుడైతే.. అతని ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొందరైతే.. జాఫర్‌ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడని అతన్ని వెనకేసుకొస్తున్నారు. జాఫర్‌ వ్యాఖ్యల్లో తప్పేముంది.. రోహిత్‌ ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు కాబట్టి, వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో అతను ఆడతాడనుకోవడం లేదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడంటున్నారు.

టీమిండియా బౌలింగ్‌ కంటే పాక్‌ బౌలింగ్‌ బలంగా ఉందని జాఫర్‌ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుడు అర్ధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే భారత్‌ బౌలింగ్‌ బలహీనంగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని జాఫరే కాదు ఎవరిని అడిగినా చెబుతారు.

ఇక, సూర్యకుమార్‌ విషయానికొస్తే.. మెగా టోర్నీలో 185కు పైగా స్ట్రయిక్‌ రేట్‌ కలిగిన స్కై.. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో, డూ ఆర్‌ డై సెమీస్‌ మ్యాచ్‌లో, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేదన్నది బహిరంగ రహస్యమేనని జాఫర్‌ కామెంట్స్‌తో ఏకీభవిస్తున్నారు.   
చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించవచ్చు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top