T20 WC: వారెవ్వా.. ‘ఏడాది’ తర్వాత జట్టులోకి.. ఒక్క ఓవర్‌.. 4 పరుగులు.. 3 వికెట్లు!

T20 WC 2022 Warm Up: Mohammed Shami Shines India Defeat Australia - Sakshi

T20 World Cup Warm Ups- Australia vs India: చాలా కాలం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఆఖర్లో ఒకే ఓవర్‌ బౌలింగ్‌ చేసిన అతడు కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విజయం టీమిండియానే వరించింది.

ప్చ్‌.. రోహిత్‌, కోహ్లి..
టీ20 వరల్డ్‌కప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా వార్మప్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 33 బంతుల్లో 57 పరుగులతో కదం తొక్కగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు. 14 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(13 బంతుల్లో 19 పరుగులు) నిరాశ పరచగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధ శతకంతో రాణించాడు. ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌ విలువైన 20 పరుగుల జోడించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన రోహిత్‌ సేన 186 పరుగులు చేసింది.

అదిరిపోయే ఆరంభం.. కానీ
ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (35), ఆరోన్‌ ఫించ్‌(76) పరుగులతో శుభారంభం అందించినా మిగతా బ్యాటర్లు దీనిని నిలబెట్టుకోలేకపోయారు. స్టీవ్‌ స్మిత్‌(11), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (23) తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా 7,5,1,7,0,0,0 స్కోర్లు నమోదు చేశారు. 

కోలుకోలేని దెబ్బ కొట్టిన షమీ.. సమిష్టి ప్రదర్శనతో
ముఖ్యంగా ఆఖరి ఓవర్‌లో బంతి అందుకున్న మహ్మద్‌ షమీ ఆసీస్‌ కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మూడు వికెట్లు తీయడం సహా వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌తో కలిసి ఓ రనౌట్‌లో భాగమయ్యాడు. 

ఇదిలా ఉంటే కోహ్లి కీలక సమయాల్లో అద్భుత ఫీల్డింగ్‌తో రెండు క్యాచ్‌లు అందుకోవడం సహా కళ్లు చెదిరే రీతిలో టిమ్‌ డేవిడ్‌ను రనౌట్‌ చేశాడు. ఇలా ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శనతో టీమిండియా వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 6 పరుగుల తేడాతో ఓడించింది.

కాగా టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత చాలా కాలం జట్టు(పొట్టి ఫార్మాట్‌లో)కు దూరమైన షమీ.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచకప్‌-2022 జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న అతడికి స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయపడటంతో ప్రధాన జట్టులో చోటు దక్కింది.

చదవండి: T20 WC 2022: అయ్యో కార్తిక్‌! అప్పుడు కూడా ఇలాగే చేశావంటే కష్టమే!
T20 World Cup 2022: ప్రపంచకప్‌లో మరో సంచలనం.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన స్కాట్లాండ్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top