T20 WC 2022: జింబాబ్వేతో కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌

T20 WC 2022: No Rain Effect For India, Zimbabwe Match - Sakshi

సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకునే క్రమంలో రేపు (నవంబర్‌ 6) జింబాబ్వేతో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. మ్యాచ్‌కు వేదిక అయిన మెల్‌బోర్న్‌లో వర్షం పడే సూచనలు లేవని అక్కడి వాతావరణ శాఖ ప్రిడిక్షన్‌లో పేర్కొంది. ఇదే వేదికపై గతవారం మూడు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో టీమిండియాతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొని ఉండింది.

అయితే వాతావరణ శాఖ ప్రకటనతో భారతీయులంతా ఊపిరి పీల్చుకున్నారు. మ్యాచ్‌ జరిగే సమయాని​కి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు)  మెల్‌బోర్న్‌లో వాతావరణం క్లియర్‌గా ఉంటుందని, టెంపరేచర్‌ 25 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2 నుంచి సెమీస్‌ రేసులో టీమిండియా ముందున్న విషయం తెలిసిందే. భారత్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రేపు జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తే.. ఈ గ్రూప్‌లో అగ్రస్థానంతో సెమీస్‌కు వెళ్తుంది. మరోపక్క టీమిండియాతో పాటు సెమీస్‌ రేసులో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్తాన్‌ జట్లు సైతం రేపే తమ ఆఖరి సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. రేపు ఉదయం 5:30 గంటలకు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే.. నేరుగా సెమీస్‌కు అర్హత సాథిస్తుంది. ఉదయం 9:30 గంటలకు జరుగబోయే మరో మ్యాచ్‌లో పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో పాక్‌ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచినా దాయాది జట్టు సెమీస్‌ అవకాశాలు భారత్‌, దక్షిణాఫ్రికాల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top