
ఐపీఎల్-2025లో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దుమ్ములేపుతున్నాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సూర్య భాయ్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో వరుసగా అత్యధిక సార్లు 25 పరుగులు దాటిన క్రికెటర్‌గా సూర్య చరిత్రపుటలెక్కాడు. ఐపీఎల్-2025 సీజన్‌లో ఈ ముంబైకర్ వరుసగా 14 సార్లు 25 పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా పేరిట ఉండేది.
బావుమా వరుసగా 13 టీ20 మ్యాచ్‌లలో 25 ప్లస్ పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ కెప్టెన్‌ను సూర్య అధిగమించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 640 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్దానంలో కొనసాగుతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ టాప్ స్దానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
సూర్యకుమార్ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్ష్‌దీప్, యాన్సెన్, వైశాక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలుపొందింది.
చదవండి: గిల్‌ను కాదు అతడిని కెప్టెన్‌గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్