SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్‌ | IPL 2025 Sunrisers Hyderabad Beat Chennai Super Kings By 5 Wickets, Check Out Full Score Details Inside | Sakshi
Sakshi News home page

SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్‌

Apr 26 2025 3:08 AM | Updated on Apr 26 2025 9:45 AM

Sunrisers Hyderabad beat CSK by 5 wickets

హైదరాబాద్‌కు కీలక విజయం

5 వికెట్లతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చిత్తు

రాణించిన ఇషాన్, కమిందు మెండిస్‌  

చెపాక్‌ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గతంలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి చక్కటి బౌలింగ్‌తో సూపర్‌ కింగ్స్‌ను 154 పరుగులకే పరిమితం చేసినా... వరుసగా విఫలమవుతున్న బ్యాటింగ్‌ బృందంతో గెలుపుపై మళ్లీ సందేహాలు. ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించగా 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. 

అయితే కమిందు మెండిస్‌కు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి జత కలిశాడు. వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో ఆడి రైజర్స్‌ శిబిరంలో ఆనందం నింపారు. టోర్నీలో మూడో విజయంతో హైదరాబాద్‌కు కాస్త ఊరట దక్కగా... ఏడో పరాజయంతో చెన్నై ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు దాదాపు ముగిసినట్లే!   

చెన్నై: ఐపీఎల్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో విజయం దక్కింది. తొలిసారి చెన్నైని వారి వేదికపైనే ఓడించడంలో హైదరాబాద్‌ సఫలమైంది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్‌ 5 వికెట్లతో సీఎస్‌కేపై గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. 

డెవాల్డ్‌ బ్రెవిస్‌ (25 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఆయుశ్‌ మాత్రే (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) రాణించగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్షల్‌ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, కమిందు మెండిస్‌ (22 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.  

బ్రెవిస్‌ దూకుడు... 
తొలి బంతికే ఆంధ్ర క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ (0) అవుట్‌ కావడంతో చెన్నై ఇన్నింగ్స్‌ పేలవంగా మొదలైంది. మరోవైపు గత మ్యాచ్‌ తరహాలో ఆయుశ్‌ మాత్రమే చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన స్యామ్‌ కరన్‌ (9) విఫలం కాగా... తర్వాతి ఓవర్లోనే ఆయుశ్‌ కూడా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 50/3 చేరింది. 8 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షల్‌ వదిలేశాడు. 

అయితే కొద్ది సేపటికే జడేజాను కమిందు బౌల్డ్‌ చేయగా... సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న బ్రెవిస్‌ మాత్రం కమిందు బౌలింగ్‌లో చెలరేగిపోయి 3 సిక్సర్లు బాదడం విశేషం. హర్షల్‌ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్‌ బాదిన బ్రెవిస్‌ తర్వాతి బంతికి  కమిందు మెండిస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగాడు. 

శివమ్‌ దూబే (12), ధోని (6)లతో పాటు ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన అన్షుల్‌ కంబోజ్‌ (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దీపక్‌ హుడా (21 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించడంతో స్కోరు 150 దాటింది.  

రాణించిన ఇషాన్‌ కిషన్‌... 
ఛేదనలో సన్‌రైజర్స్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే అభిషేక్‌ శర్మ (0) అవుట్‌ కావడంతో తొలి దెబ్బ పడింది. ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోగా పవర్‌ప్లేలో 37 పరుగులే వచ్చాయి. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన హెన్రిచ్‌ క్లాసెన్‌ (7) విఫలం కావడంతో రైజర్స్‌ కష్టాలు మరింత పెరిగాయి. 

వేగంగా ఆడే ప్రయత్నంలో రైజర్స్‌ వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యవధిలో కిషన్, అనికేత్‌ వర్మ (19 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే కమిందు, ఏడో స్థానంలో వచ్చిన నితీశ్‌ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్‌; 2 ఫోర్లు) ఒత్తిడిని అధిగమించి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చారు.  

స్కోరు వివరాలు  
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి) అభిషేక్‌ (బి) షమీ 0; ఆయుశ్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) కమిన్స్‌ 30; స్యామ్‌ కరన్‌ (సి) అనికేత్‌ (బి) హర్షల్‌ 9; జడేజా (బి) కమిందు 21; బ్రెవిస్‌ (సి) కమిందు (బి) హర్షల్‌ 42; శివమ్‌ దూబే (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 12; హుడా (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 22; ధోని (సి) అభిషేక్‌ (బి) హర్షల్‌ 6; అన్షుల్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 2; నూర్‌ (సి) షమీ (బి) హర్షల్‌ 2; ఖలీల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 154. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–47, 4–74, 5–114, 6–118, 7–131, 8–134, 9–137, 10–154. బౌలింగ్‌: షమీ 3–0–28–1, కమిన్స్‌ 4–0–21–2, ఉనాద్కట్‌ 2.5–0–21–2, హర్షల్‌ పటేల్‌ 4–0–28–4, అన్సారీ 3–0–27–0, కమిందు మెండిస్‌ 3–0–26–1. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) ఆయుశ్‌ (బి) ఖలీల్‌ 0; హెడ్‌ (బి) కంబోజ్‌ 19; ఇషాన్‌ కిషన్‌ (సి) కరన్‌ (బి) నూర్‌ 44; క్లాసెన్‌ (సి) హుడా (బి) జడేజా 7; అనికేత్‌ (సి) హుడా (బి) నూర్‌ 19; కమిందు (నాటౌట్‌) 32; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–54, 4–90, 5–106. బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–21–1, కంబోజ్‌ 3–0–16–1, నూర్‌ అహ్మద్‌ 4–0–42–2, జడేజా 3.4–0–22–1, స్యామ్‌ కరన్‌ 2–0–25–0, పతిరణ 3–0–27–0.  

ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X  పంజాబ్‌ 
వేదిక: కోల్‌కతా
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement