IPL 2023: దేశం కంటే ఐపీఎల్‌ ముఖ్యం కాదు.. సీఎస్‌కేకు షాకివ్వనున్న బెన్‌ స్టోక్స్‌

Stokes Willing To Cut Short IPL Stint To Prepare For Home Summer - Sakshi

ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌లో తన కొత్త ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాకివ్వనున్నాడు. ఐపీఎల్‌-2023లో చివరి అంకం మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండనని పరోక్ష సంకేతాలిచ్చాడు. తనకు జాతీయ జట్టు ప్రయోజనాలే ముఖ్యమని చెప్పకనే చెప్పిన స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కోరితే ఐపీఎల్‌లో ఆఖరి మ్యాచ్‌లకు డుమ్మా కొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు.

ఐపీఎల్‌ చివరి మ్యాచ్‌లకు ఈసీబీకి సంబంధం ఏంటంటే.. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే తేదీకి (మే 28) సరిగ్గా నాలుగు రోజుల తర్వాత (జూన్‌ 1) ఇంగ్లండ్‌.. ఐర్లాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఇది ఈసీబీకి అంత ముఖ్యం కాకపోయినప్పటికీ..  ఆ వెంటనే (జూన్‌ 16) స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 5 మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ మాత్రం చాలా ముఖ్యం.

యాషెస్‌ సిరీస్‌ దృష్ట్యా ఐర్లాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌కు ప్రాధాన్యత పెరగడంతో ఈసీబీ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ను ఈ మ్యాచ్‌కు సిద్ధంగా ఉండమని కోరవచ్చు. ఈ విషయంపై ఈసీబీ స్టోక్స్‌ను ఇప్పటివరకు సంప్రదించనప్పటికీ.. మనోడు ముందు ముందే తన సన్నద్ధతను రివీల్‌ చేసి జాతీయ జట్టు ప్రయోజనాలే తన ముఖ్యమని చెప్పకనే చెప్పాడు.

స్టోక్స్‌ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ చూసి భారత క్రికెట్‌ అభిమానులు జస్ప్రీత్‌ బుమ్రాపై మండిపడుతున్నారు. జాతీయ జట్టు పట్ల విదేశీ ఆటగాళ్లకు ఉన్న కమిట్‌మెంట్‌ను చూసి సిగ్గు తెచ్చుకోవాలని ఫైరవుతున్నారు. ఐపీఎల్‌ కోసం జాతీయ జట్టు ప్రయోజనాలను తాకట్టుపెట్టడం సబబు కాదని హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్‌ కోసం బుమ్రా.. ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి దూరంగా ఉన్నాడని ప్రచారం​ జరుగుతున్న నేపథ్యంలో కొందరు ఫ్యాన్స్‌ ఇలా రియాక్ట్‌ అవుతున్నారు. కాగా, 2023 ఐపీఎల్‌ వేలంలో సీఎస్‌కే బెన్‌ స్టోక్స్‌ను 16.25 కోట్లు పోసి కొనుకున్న విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top