
మూడో రౌండ్‌లో ఓడిన ఆరో సీడ్
ఒసాకా కూడా ఇంటిముఖం
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్టార్ ప్లేయర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా)... ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్‌లో ఇంటిముఖం పట్టగా... పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 104వ ర్యాంకర్, 37 ఏళ్ల లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–3తో మాడిసన్ కీస్‌పై సంచలన విజయం సాధించి తన కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 93 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో లౌరా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. కీస్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 31 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో పావ్లీచెంకోవా (రష్యా) 3–6, 6–4, 6–4 తో ఒసాకాను ఓడించి 2016 తర్వాత మరోసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
డ్రేపర్ అవుట్
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 2017 రన్నరప్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 2 గంటల 39 నిమిషాల్లో 6–4, 6–3, 1–6, 6–4తో డ్రేపర్‌ను ఓడించాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) 6–1, 6–1, 6–3తో వుకిచ్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–4, 6–3, 6–7 (5/7), 6–1తో ఫొకీనా (స్పెయిన్)పై, 14వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 7–5, 6–2, 6–3తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
యూకీ జోడీ బోణీ
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–జిన్‌యు జియాంగ్ (చైనా) జోడీ 6–3, 1–6, 7–6 (10/6)తో హారిసన్–నికోల్ మెలిచార్ (అమెరికా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది.