
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ వశం
ఫైనల్లో అల్‌కరాజ్‌పై ఘనవిజయం
కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఇటలీ స్టార్
రూ. 34 కోట్ల 85 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపాన్ని చూపిన ఇటలీ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ‘వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్’ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 4–6, 6–4, 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సినెర్‌కు 30 లక్షల పౌండ్లు (రూ. 34 కోట్ల 85 లక్షలు), రన్నరప్ అల్‌కరాజ్‌కు 15 లక్షల 20 వేల పౌండ్లు (రూ. 17 కోట్ల 66 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
3 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో గెలవడం ద్వారా గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్‌కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి 23 ఏళ్ల సినెర్ బదులు తీర్చుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించాడు. ఓవరాల్‌గా సినెర్ ఖాతాలో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.
సినెర్ 2024, 2025లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్... 2024లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. సినెర్ చేతిలో ఓటమితో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అల్‌కరాజ్‌కు తొలిసారి పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్‌కంటే ముందు 22 ఏళ్ల అల్‌కరాజ్ ఫైనల్ చేరిన ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (2022 యూఎస్ ఓపెన్; 2023 వింబుల్డన్; 2023 ఫ్రెంచ్ ఓపెన్; 2024 వింబుల్డన్; 2025 ఫ్రెంచ్ ఓపెన్) విజేతగా నిలిచాడు.
తొలి సెట్ కోల్పోయినా...
గతంలో అల్‌కరాజ్ చేతిలో ఎనిమిదిసార్లు ఓడిపోయి, నాలుగుసార్లు మాత్రమే నెగ్గిన సినెర్ వింబుల్డన్ ఫైనల్లో శుభారంభం చేయలేకపోయాడు. తొలి సెట్‌లో 4–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... అల్‌కరాజ్ ధాటికి సినెర్ వరుసగా నాలుగు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను 4–6తో చేజార్చుకున్నాడు. తొలి సెట్‌ను కోల్పోయినా... ఆందోళన చెందకుండా సంమయనంతో ఆడిన సినెర్ రెండో సెట్‌లో తొలి గేమ్‌లోనే అల్‌కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు.
ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో నెగ్గి 1–1తో సమం చేశాడు. మూడో సెట్‌లోని తొమ్మిదో గేమ్‌లో అల్‌కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పదో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకున్న సినెర్ సెట్‌ను 6–4తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లోనూ సినెర్ దూకుడు కొనసాగించి మూడో గేమ్‌లో అల్‌కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు విజయాన్ని ఖరారు చేసుకున్నాడు.