
Photo Courtesy: BCCI
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇంత వరకు ఏ వికెట్ కీపర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇషాన్‌ను వదిలివేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రూ. 11.25 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. ఇందుకు తగ్గట్లుగానే ఈ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ ఇరగదీశాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కానీ తర్వాత మాత్రం ఇషాన్ కిషన్ వరుసగా విఫలమయ్యాడు. ఒకానొక దశలో తుదిజట్టు నుంచి తప్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో తొలిసారిగా అతడికి యాజమాన్యం వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించింది.
హెన్రిచ్ క్లాసెన్ స్థానంలో
హెన్రిచ్ క్లాసెన్‌ను బ్యాటర్‌గా రంగంలోకి దింపి.. అతడి స్థానంలో ఇషాన్‌ను తమ జట్టు వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేయించింది. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఓపెనర్ కరుణ్ నాయర్‌ను డకౌట్ చేసిన రైజర్స్ సారథి, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్.. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (3) వికెట్ తీశాడు.
అనంతరం వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (8)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ ముగ్గురూ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి దాదాపుగా ఒకే రీతిలో అవుటయ్యాడు.
టాప్-4 బ్యాటర్ల వికెట్లలో భాగమై
ఆ తర్వాత జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్ ఢిల్లీ స్టార్ కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా ఇషాన్ ఒడిసిపట్టాడు. తద్వారా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్ల వికెట్లలో భాగమై.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇలా ఓ వికెట్ కీపర్ ప్రత్యర్థి జట్టుకు చెందిన నలుగురు టాప్ బ్యాటర్ల క్యాచ్ అందుకోవడం ఇదే తొలిసారి.
ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు అందకున్న 27వ ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. ఇందులోని వికెట్ కీపర్ల జాబితాలో అతడిది పదమూడో స్థానం కావడం గమనార్హం.
ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్
మ్యాచ్ విషయానికొస్తే.. టాపార్డర్ విఫలమైన వేళ మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్ (10), కెప్టెన్ అక్షర్ పటేల్ (6) కూడా నిరాశపరిచారు. అయితే ఆరు, ఎనిమిదో స్థానాల్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (41 నాటౌట్), అశుతోష్ శర్మ (41) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
అయితే, ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం పడింది. అవుట్‌ఫీల్డ్ మొత్తం తడిగా మారడంతో మ్యాచ్ కొనసాగే వీలు లేకపోవడంతో అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరోవైపు.. ఢిల్లీ ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి.