
ఐపీఎల్-2025 (IPL 2025)లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) విఫలమవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా, బ్యాటర్‌గా వరుస మ్యాచ్‌లలో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటికి మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పంత్.. కేవలం 128 పరుగులు రాబట్టగలిగాడు.
ఇదే అత్యంత చెత్త ప్రదర్శన
2016లో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన పంత్ కెరీర్‌లో ఇప్పటికి ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. ఈ నేపథ్యంలో మేటి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్ క్రిస్ట్ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆ ముఖంలో నవ్వే లేదు..
‘‘అతడిని చూసిన ప్రతిసారీ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తూ ఆడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఈసారి తను అలా లేడు. ఆ ముఖంలో నవ్వు లేదు.. సహచర ఆటగాళ్లతో సరదాగా ఉన్నట్లు కనిపించడం లేదు.. ప్రశాంతవదనంతో ఉన్నాడా అంటే అదీ లేదు.
కొత్త ఫ్రాంఛైజీ తరఫున కెప్టెన్సీ భారమా లేదంటే ప్రైస్ ట్యాగ్ అతడి నెత్తి గుదిబండగా మారిందా అర్థం కావడం లేదు. ఇది అతడు కానే కాదని వంద శాతం చెప్పగలను. అతడి ఆటలో మునుపటి మెరుపు, చురుకుదనం కనిపించడం లేదు’’ అని క్రిక్‌బజ్ షోలో గిల్‌క్రిస్ట్ అన్నాడు.
రహానే, కోహ్లి కావాలేమో?
ఇందుకు అదే షోలో పాల్గొన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్ బదులిస్తూ.. ‘‘పంత్ విషయంలో మీరు ఇచ్చిన చెప్పిన మాటల్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నా. అతడు సొంతగడ్డపై.. చుట్టూ భారత క్రికెటర్లు ఉంటే మాత్రమే అతడు ఆటను ఆస్వాదిస్తాడా?
వారి కంపెనీని మాత్రమే ఎంజాయ్ చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు అతడి చుట్టూ ప్రధానంగా నలుగురూ విదేశీ బ్యాటర్లే ఉన్నారు. పంత్ సహచరులతో సంతోషంగా లేడని అంటున్నారా?
అజింక్య రహానే, విరాట్ కోహ్లి తన జట్టులో ఉంటే పంత్ మారిపోతాడా? అంటే సమాధానం చెప్పలేము. ఏదేమైనా పంత్ మునుపటిలా మాత్రం లేడన్నది వాస్తవం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మెగా వేలం-2025లో రూ. 27 కోట్లకు లక్నో పంత్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు.
పది జట్ల స్థానాలు ఇలా
ఈ సీజన్‌లో ఇప్పటికి 128 పరుగులు చేసిన పంత్ అత్యధిక స్కోరు 63. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం ఐదే గెలిచి.. ఆరు ఓడిపోయింది.
తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
ఆర్సీబీ 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండి.. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ రెండు, ముంబై ఇండియన్స్ మూడు, గుజరాత్ టైటాన్స్ నాలుగు, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్, ఏడో స్థానంలో ఉన్న లక్నో కూడా సాంకేతికంగా ఇంకా రేసులో ఉన్నాయి.
చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్