మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేశారు.. అంద‌రికి ధన్యవాదాలు: కావ్య మార‌న్ | Sakshi
Sakshi News home page

మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేశారు.. అంద‌రికి ధన్యవాదాలు: కావ్య మార‌న్

Published Mon, May 27 2024 7:05 PM

SRH owner Kaviya Maran in consolation speech after IPL final loss

ఐపీఎల్‌-2024 సీజ‌న్ ర‌న్న‌ర‌ప్‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం అద‌ర‌గొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ కీలక‌మైన ఫైన‌ల్లో మాత్రం చేతులేత్తేసింది. చెపాక్ వేదిక‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది. 

మ‌రోవైపు కేకేఆర్ ముచ్చ‌ట‌గా మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి అనంత‌రం ఆ జ‌ట్టు ఓన‌ర్ కావ్య మార‌న్ భావోద్వేగానికి లోన‌య్యారు. కావ్య స్టాండ్స్‌లో త‌మ ఆట‌గాళ్ల పోరాటాన్ని అభినందిస్తూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.

ఆట‌గాళ్ల‌ను ఓదార్చిన కావ్య‌..
అయితే మ్యాచ్‌ ముగిసిన త‌ర్వాత కావ్య అంత‌టి బాధ‌లోనూ స‌న్‌రైజ‌ర్స్ డ్రెస్సింగ్ రూమ్‌ను సంద‌ర్శించింది. త‌మ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు కావ్య ధైర్యం చెప్పి ఓదార్చింది. "మీరు మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేశారు. 

ఈ విష‌యం చెప్ప‌డానికి నేను ఇక్క‌డికి వ‌చ్చాను.  మీ ఆట‌తో టీ20 క్రికెట్‌కు కొత్త ఆర్ధం చెప్పారు. అంద‌రూ మ‌న గురించి మాట్లాడేలా చేశారు. ఈ రోజు మ‌నం ఓడిపోవాల‌ని రాసి పెట్టింది. కాబ‌ట్టి మ‌నం ఓడిపోయాం. కానీ మ‌న బాయ్స్ అంతా అద్బుతంగా ఆడారు.

బ్యాటింగ్‌, బౌలింగ్ అన్ని విభాగాల్లో బాగా రాణించారు. అంద‌రికి ధన్యవాదాలు. అదే విధంగా మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేసేందుకు స్టేడియం వ‌చ్చిన అభిమానులందరికీ ప్ర‌త్యేక ధన్యవాదాలు" అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చిన స్పీచ్‌లో కావ్య పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement