కర్ణాటక మిస్టరీ స్పిన్నర్ కేసీ కరియప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 31 ఏళ్ల వయస్సులోనే భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కరియప్ప షాకిచ్చాడు. అతడు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
"స్ట్రీట్ క్రికెట్ నుంచి స్టేడియంలో ఫ్లడ్ లైట్లలో ఆడడం వరకు నా ప్రయాణం ఒక్క అద్భుతం. గర్వంగా జెర్సీ ధరించి, ఒకప్పుడు నేను కన్న కలలను నిజం చేసుకున్నాను. అయితే ఈ రోజు భారత క్రికెట్ నుంచి నేను వైదొలుగుతున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. విజయాలు చిరునవ్వును ఇస్తే, ఓటములు నన్ను రాటుదేల్చాయి. నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" తన రిటైర్మెంట్ నోట్‌లో పేర్కొన్నాడు.
కాగా బీసీసీఐతో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కరియప్ప విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడే అవకాశముంది. కరియప్ప తన డొమెస్టిక్ కెరీర్‌లో కర్ణాటక, మిజోరం జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 157 వికెట్లు పడగొట్టారు. అయితే ఐపీఎల్ 2015 వేలంతో కరియప్ప వెలుగులోకి వచ్చాడు.
ఏ మాత్రం అనుభవం లేనిప్పటికి కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం అప్పటిలో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాతి సీజన్లలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు గతకొంతకాలంగా అతడికి దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు కూడా ఛాన్స్‌లు రావడం లేదు. ఈ క్రమంలోనే భారత క్రికెట్‌కు కరియప్ప విడ్కోలు పలికాడు.


