PC: BCCI/SRH
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 లీగ్ దశను ఘన విజయంతో ముగించింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.
హెడ్‌పై కోహ్లి ఆగ్రహం
సొంతమైదానం ఉప్పల్‌లో ఆర్సీబీపై 255 పరుగులు స్కోరు చేసిన సన్‌రైజర్స్.. ప్రత్యర్థిని 200 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్- ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి మధ్య కోల్డ్‌వార్ నడిచింది.
విధ్వంసకర వీరుడిగా పేరొందిన హెడ్ ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 26 పరుగులే చేసి.. రసిఖ్ దర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ క్రమంలో కోహ్లి దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.
అనంతరం ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో శివంగ్ కుమార్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ బౌండరీలు బాదుతున్న వేళ.. హెడ్‌పై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయి అన్నట్లుగా సైగలు చేశాడు. అయితే, హెడ్ మాత్రం ఇందుకు పెద్దగా స్పందించలేదు.
#ViratKohli 🆚 #TravisHead 🥵🤯
Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026
షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ కోహ్లి.. హెడ్ పట్ల కాస్త వింతగా ప్రవర్తించాడు. అతడికి షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ముఖం తిప్పేసుకున్నాడు. దీంతో హెడ్ అలా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Virat Kohli ignored Travis Head when he tried to shake hands with him after the match 😭#SRHvsRCB pic.twitter.com/urAY79pYQ0
— Indian Cricket (@IPL2025Auction) May 22, 2026
కాగా కోహ్లి తీరుకు ఎస్‌ఆర్‌హెచ్‌తో పాటు హెడ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో హెడ్ అనూహ్య రీతిలో బౌలింగ్‌కు దిగాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (39 బంతుల్లో 56)ను అవుట్ చేశాడు. తద్వారా గత తొమ్మిదేళ్లలో ఐపీఎల్‌లో తన తొలి వికెట్ నమోదు చేశాడు.
వచ్చాడు.. బౌలింగ్ చేశాడు.. వికెట్ తీశాడు
ఈ నేపథ్యంలో వికెట్ తీసిన తర్వాత హెడ్ సంతోషంగా ఉన్న ఫొటోను పంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. ‘‘వచ్చాడు.. బౌలింగ్ చేశాడు.. వికెట్ తీశాడు’’ అని కోహ్లికి కౌంటర్ ఇచ్చింది. ఇక ఇదే ఫొటోను షేర్ చేసిన హెడ్.. ‘‘ఇదేంటో గెస్ చేయండి’’ అని క్యాప్షన్ జతచేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి 11 బంతుల్లో 15 పరుగులు చేసి సకీబ్ హుసేన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ, గుజరాత్‌లతో పాటు.. తాజా విజయంతో సన్‌రైజర్స్ ఖాతాలో కూడా 18 పాయింట్లు చేరాయి. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడిన సన్‌రైజర్స్ మూడో స్థానంతో ముగించింది. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడక తప్పని పరిస్థితి.


