వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్‌ | Pat Cummins Hails Sunrisers Hyderabad Bowling Unit After Dominant Win Over RCB, Check Highlights Inside | Sakshi
Sakshi News home page

వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్‌

May 23 2026 4:13 AM | Updated on May 23 2026 10:06 AM

Skipper Cummins hails SRH bowling unit after win over RCB

ఐపీఎల్‌-2026 సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భారీ విజ‌యంతో లీగ్ ద‌శ‌ను ముగించింది. శుక్ర‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 55 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. 

అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), హెన్రిచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంత‌రం 256 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 200 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. 

అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ అద్భుత‌మైన విజ‌యం సాధించిన‌ప్ప‌టికి క్వాలిఫ‌య‌ర్‌-1కు మాత్రం అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. 90 ప‌రుగుల తేడాతో గెలిచి ఉంటే ఆరెంజ్ ఆర్మీకి టాప్-2 ప్లేస్ దక్కేది. కానీ 35 పరుగుల దూరంలో క్వాలిఫ‌య‌ర్‌-1 బెర్త్ ద‌క్కించుకునే అవ‌కాశాన్ని హైద‌రాబాద్ జ‌ట్టు కోల్పోయింది. ఇక ఈ విజ‌యంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ స్పందించాడు. జట్టులోని బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి ఫామ్‌లోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

"ఈ ఏడాది సీజన్‌లో తొలిసారి 250కు పైగా స్కోర్ సాధించడం అద్భుతంగా అనిపించింది. ఈ రోజు బ్యాటింగ్‌లో మా కుర్రాళ్లు ఇరగదీశారు. అలాగే మా బౌలర్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ రిథమ్‌ను అందుకున్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. 

ప్రత్యర్థి జట్టు కూడా లక్ష్యానికి చేరువగా వచ్చేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో మేము కొన్ని కొత్త ప్రయోగాలు చేశాం. అయినప్పటికి ఇది మాకు చాలా పెద్ద విజయమని" క‌మిన్స్ పేర్కొన్నాడు. అదేవిధంగా జట్టు బౌలింగ్ విభాగంపై క‌మిన్స్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు.

"మా బౌలర్లు ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను కూడా వారి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ముఖ్యంగా పవర్ ప్లేలో ఇషాన్ మలింగ బౌలింగ్ చేసిన విధానం అద్భుతం.  'స్లోయర్ బాల్స్‌,  బౌలింగ్‌లో వైవిధ్యాలను ప్రదర్శించడంలోనూ అతడు దిట్ట. 

ఈ టోర్నీలోనే టాప్ బౌలర్లలో ఒకడిగా అతడు నిలిచాడు. ఇక సాకిబ్ హుస్సేన్ కూడా అదరగొడుతున్నాడు. ఇలాంటి బౌలర్లు జట్టులో ఉండటం కెప్టెన్‌గా నాకు లభించిన వరమనే చెప్పాలి. మా తదుపరి మ్యాచ్‌కు ఇంకా 5-6 రోజుల సమయం ఉంది. కాబట్టి ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని చంఢీఘర్‌కు బయలుదేరుతాము. మా ఆటగాళ్లకు ఆ మైదానం గురించి బాగా తెలుసు. రాబోయే ఒకటి రెండు రోజుల్లో మేము తదుపరి మ్యాచ్‌లో ఎవరితో తలపడబోతున్నామనేది స్పష్టమవుతుందని" క‌మిన్స్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement