
భారత సైన్యానికి క్రీడా స్టార్లు సలామ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యలను తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎదుర్కొంటున్న భారత త్రివిధ దళాలకు క్రీడా దిగ్గజాలు మద్దతు పలికారు. క్రికెట్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా చాంపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులు దేశ ప్రజల సంరక్షణ కోసం పగలనక... రాత్రనక శ్రమిస్తున్న సాయుధ బలగాల ధైర్యానికి సెల్యూట్ చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న భారత సేనల ధైర్య సాహసాల్ని స్టార్లంతా కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా తామంతా సైన్యం వెంటే అని స్థయిర్యం పెంచారు.
దేశ రక్షణే లక్ష్యంగా శ్రమిస్తోన్న భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను చూసి గర్వపడుతున్నా. త్రివిధ దళాలు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఈ పోరాటయోధుల వల్లే భారత్ తలెత్తుకొని నిలబడుతోంది. దేశం కోసం అహరి్నశలు శ్రమించే మీ వెంటే జాతి మొత్తం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని విజ్ఞప్తి. –భారత కెప్టెన్ రోహిత్ శర్మ
సాయుధ బలగాలకు నా సలామ్. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా ఎదురునిలిచి దేశాన్ని కాపాడే మన వీరుల ధైర్యసాహసాలకు జేజేలు పలుకుతున్నాం. భారత్ కోసం మీరు, మీ కుటుంబసభ్యులు చేసే త్యాగాలకు మేమంతా రుణపడే ఉంటాం. –విరాట్ కోహ్లి
ఉగ్రవాదులను హతమార్చితే మౌనంగా ఉండాల్సిన చోట పాక్ యుద్ధాన్ని ఎంచుకొని తమ వక్రబుద్ధిని మరోమారు చూపింది. దీనికి తగిన గుణపాఠం మా సైన్యం మీకు నేర్పుతుంది. ఆ పాఠమెలా ఉంటుందంటే జీవితంలో మీరెప్పుడు మర్చిపోరు. –వీరేంద్ర సెహ్వాగ్
టెర్రరిజంపై పోరాటం... దేశ రక్షణకోసం మీరు కనబరిచే సాహసాలు మాకెంతో గర్వకారణం. సరిహద్దుల్లో మీరున్నారనే ధైర్యమే దేశాన్ని ధీమాగా నడిపిస్తోంది.–నీరజ్ చోప్రా
భారత దళాలు చూపే ధైర్యం, క్రమశిక్షణ, త్యాగాలే దేశానికి బలం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించి మన పతకాన్ని రెపరెపలాడించిన మీ నిస్వార్థసేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జై హింద్. –పీవీ సింధు