ICC ODI WC 2023: 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్‌ బెడిసికొట్టిందా?

Speculation Around Pakistan-ODI-WC Venues BCCI-ICC Maintain Status Quo - Sakshi

ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఆసియా కప్‌కు పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వనుంది. అయితే పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ విముఖత వ్యక్తం చేసింది. తటస్థ వేదికలో అయితే మ్యాచ్‌లు ఆడేందుకు తాము సిద్ధమని.. లేదంటే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. దీంతో కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) ఆధ్వర్యంలో బీసీసీఐ, పీసీబీలతో మీటింగ్‌ జరిగింది.

ఈ మీటింగ్‌లో ఆసియా కప్‌లో భారత్‌ ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఏసీసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.. ఇందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును(పీసీబీ) కూడా ఒప్పించింది. ఒకవేళ భారత్‌ ఫైనల్‌ చేరితే అప్పుడు ఫైనల్‌ కూడా తటస్థ వేదికలో నిర్వహించేందుకు అంగీకరించాలని పీసీబీని కోరింది. దీనికి పీసీబీ ఒప్పుకుంది. అయితే ఆసియా కప్‌ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకోవడం పీసీబీకి గిట్టనట్లుంది.

దీంతో ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తాము ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదిక(బంగ్లాదేశ్‌లో) నిర్వహించాలని ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ ఏం స్పందించలేదని తెలిసింది. అయితే ఐసీసీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ''ఆసియా కప్‌ అనేది ఉపఖండపు టోర్నీ. అందులో నాలుగు నుంచి ఆరు దేశాలు మాత్రమే పాల్గొంటాయి. పైగా బీసీసీఐ కనుసన్నల్లోనే ఆ టోర్నీ జరుగుతుందని అందరికి తెలుసు. ఏసీసీ కౌన్సిల్‌లో అగ్రభాగం భారత్‌దే. కానీ ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్‌కప్‌ అనేది మెగా టోర్నీ. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎక్కడ ఆతిథ్యం ఇస్తే అక్కడికి వచ్చి ఆడాల్సిందే.. అంతేకానీ ఒకరి స్వార్థం కోసం వేదికలు మార్చడానికి ఆస్కారం లేదు.

2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యమిస్తుంది. ఈ విషయాన్ని ముందే ఆయా దేశాల క్రికెట్‌ బోర్డుల దృష్టికి తీసుకెళ్లాం. కేవలం మీకోసం మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించలేం. వరల్డ్‌ కప్‌ ఆడేందుకు వచ్చే దేశాలు ఒకే వేదికలో మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని అనుకుంటాయి. ఇప్పుడు ఇలా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించడం మంచి పద్దతి కాదు.

పీసీబీ అడిగింది న్యాయపరమైనదే కావొచ్చు. పాక్‌ ఆడే మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని అడిగారు. కానీ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చే వాటిలో భారత్‌ ఒకటే ఉంది. బంగ్లాదేశ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై దృష్టి సారిస్తాం'' అని పేర్కొన్నారు. 

ఆసియా కప్‌లో టీమిండియా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడేలా ఏసీసీని ఒప్పించి తమ పంతం నెగ్గించుకుంది బీసీసీఐ. ఇది మనసులో పెట్టుకొనే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో ఆడుతామని లేఖ రాసిందని టీమిండియా అభిమానులు పేర్కొన్నారు. కానీ పీసీబీ ప్లాన్‌ బెడిసికొట్టింది. ఆసియా కప్‌ అనేది ఉపఖండపు టోర్నీ.. అది మీ ఇష్టం.. కానీ వన్డే వరల్డ్‌కప్‌ అనేది మెగా టోర్నీ.. అలా కుదరదు అని ఐసీసీ చెప్పకనే చెప్పింది. దీంతో బీసీసీఐని దెబ్బకు దెబ్బ తీయాలని భావించిన పీసీబీ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్లుగా తయారైందని అభిమానులు  వ్యంగ్యంగా స్పందించారు. 

ఇక అక్టోబర్‌ 5న ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో 48 లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు 12 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రతీ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక టోర్నీలో అత్యంత క్రేజ్‌ ఉన్న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ను చెన్నై లేదా ఢిల్లీలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్‌ చేస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ప్రతిష్టాత్మక ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. ఒక సెమీఫైనల్‌ను ముంబైలోని వాంఖడేలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ మరొక సెమీఫైనల్‌ కోసం వేదికను వెతికే పనిలో ఉంది. 

చదవండి: Asia Cup 2023: పాక్‌లోనే ఆసియా కప్‌.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!

బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top