
న్యూఢిల్లీ: ఆసియా కప్–2026 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవాళీ లీగ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్య గత సీజన్‌లో భారత మహిళల ఉత్తమ ఫుట్‌బాలర్ అవార్డును అందుకుంది.
ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా భారత జట్టు గ్రూప్ ‘బి’లో ఉంది. భారత జట్టుతోపాటు గ్రూప్ ‘బి’లో థాయ్‌లాండ్, మంగోలియా, తిమోర్ లెస్టె, ఇరాక్ జట్లున్నాయి. ఈనెల 23 నుంచి జూలై 5 వరకు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లకు బ్యాంకాక్ ఆతిథ్యమిస్తుంది. ఈనెల 23న తమ తొలి మ్యాచ్‌లో మంగోలియాతో ఆడనున్న భారత జట్టు ఆ తర్వాత వరుసగా తిమోర్ లెస్టె (జూన్ 29న), ఇరాక్ (జూలై 2న), థాయ్‌లాండ్ (జూలై 5న) జట్లతో పోటీపడుతుంది. 2026 ఆసియా కప్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీకి మార్చి 1 నుంచి 21 వరకు ఆ్రస్టేలియా ఆతిథ్యమిస్తుంది. మొత్తం 12 దేశాలు బరిలోకి దిగుతాయి.
ఆతిథ్య దేశం హోదాలో ఆ్రస్టేలియా, 2022 టోర్నీ చాంపియన్ చైనా, 2022 టోర్నీ రన్నరప్ దక్షిణ కొరియా, 2022 టోర్నీలో మూడో స్థానం పొందిన జపాన్ జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన ఎనిమిది బెర్త్‌లు క్వాలిఫయర్స్ టోర్నీ ద్వారా ఖరారవుతాయి. క్వాలిఫయర్స్ టోర్నీలో మొత్తం 34 జట్లు పాల్గొంటున్నాయి. 34 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ‘ఎ’, ‘బి’ గ్రూపుల్లో 5 జట్ల చొప్పున... మిగిలిన ‘సి’, ‘డి’, ‘ఈ’, ‘ఎఫ్’, ‘జి’, ‘హెచ్’ గ్రూపుల్లో 4 జట్ల చొప్పున ఉన్నాయి. ఎనిమిది గ్రూప్‌ల విజేత జట్లు వచ్చే ఏడాది ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి.
భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు: ఎలాంగ్‌బమ్
పంథోయ్ చాను, మోనాలీసా దేవి, పాయల్ బసుదె (గోల్‌కీపర్లు), హేమం షిల్కీ దేవి, కిరణ్ పిస్దా, మార్టినా థోక్‌చోమ్, స్వీటీ దేవి, నిర్మలా దేవి, పూర్ణిమ కుమారి, సంజు, రంజన చాను (డిఫెండర్లు), అంజు తమాంగ్, గ్రేస్ డాంగ్మె, కార్తీక అంగముత్తు, రత్నబాలా దేవి, ప్రియదర్శిని సెల్లాదురై, సంగీత బస్ఫోరె (మిడ్ ఫీల్డర్లు), లిండా కోమ్ సెర్టో, మాళవిక, మనీషా కల్యాణ్, మనీషా నాయక్, ప్యారీ జక్సా, రింపా హల్దర్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్).