ఆస్పత్రిలో సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
మంత్రి జూపల్లి కృష్ణారావు
అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
కానిస్టేబుల్ సౌమ్యకు ప్రభుత్వం అండగా ఉంటుంది
లక్డీకాపూల్ (హైదరాబాద్): విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు ఎక్సైజ్ అధికారులపై దాడులకు పాల్పడుతున్నాయని, దీనిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖకు కూడా ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశం పరిశీలనలో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను సోమవారం జూపల్లి పరామర్శించారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో సౌమ్య చూపిన తెగువ, విధుల పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. దాడి జరిగిన వెంటనే వైద్యులు, సౌమ్య కుటుంబ సభ్యులు.. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారని, మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించినట్లు చెప్పారు.
సౌమ్య సంపూర్ణంగా కోలుకుంటుందని ఆశిస్తున్నామని, సౌమ్యతోపాటు ఆమె కుటుంబాన్ని కూడా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. సౌమ్య వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఆమె కోలుకున్న అనంతరం ఆరోగ్య పరిస్థితిని బట్టి విధులు కేటాయిస్తామని, ఒకవేళ విధులు నిర్వర్తించే స్థితిలో లేకపోయినా కూడా ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. సౌమ్య ఉద్యోగంపైనే ఆమె కుటుంబం ఆధారపడి ఉందని, ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
నిందితులకు త్వరగా శిక్ష పడేలా..
సౌమ్యపై దాడి కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారని మంత్రి జూపల్లి చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణ, అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగంపై సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటివరకు 1,354 కేసుల్లో 2,457 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, 5,196 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో 110 మందిపై 70 కేసులు నమోదు చేశామన్నారు. మంత్రి వెంట ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేíÙ, నిజామాబాద్, మెదక్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు సోమిరెడ్డి, హరికిషన్, తదితరులు ఉన్నారు.
మెరుగైన వైద్యం అందించండి
మంత్రి దామోదర రాజనర్సింహ
కానిస్టేబుల్ సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నిమ్స్‌లో సౌమ్యను మంత్రి పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సౌమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, నిమ్స్ డైరెక్టర్ డా.భీరప్ప ఉన్నారు.


