
ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై నేషన్ సిరీస్‌లో సత్తా చాటిన మంధన.. తాజాగా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.
ఈ టోర్నీలో సెంచరీ (ఫైనల్లో), అర్ద సెంచరీ సాయంతో 264 పరుగులు చేసిన మంధన.. తన రేటింగ్ పాయింట్లను 727కు పెంచుకుని ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్‌ను మూడో స్థానానికి పడేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
మంధనకు లారాకు మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మంధన ఒక్కరే ఉన్నారు. హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), ఎల్లిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), అలైసా హీలీ (ఆస్ట్రేలియా), చమారీ ఆటపట్టు (శ్రీలంక), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), ఆష్లే గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా), ఆమీ జోన్స్ (ఇంగ్లండ్) వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.
ట్రై నేషన్ సిరీస్‌లో రాణించిన చమారీ ఆటపట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకింది. భారత ప్లేయర్లలో జెమీమా రోడ్రిగెజ్ 15, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 16, దీప్తి శర్మ 32, రిచా ఘోష్ 42, ప్రతిక రావల్ 45, హర్లీన్ డియోల్ 52, యస్తికా భాటియా 67, పూజా వస్త్రాకర్ 70, షఫాలీ వర్మ 86, స్థానాల్లో ఉన్నారు.
ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికాపై సెంచరీతో రాణించిన జెమీమా 5 స్థానాలు మెరుగుపర్చుకోగా.. ఇదే టోర్నీలో సత్తా చాటిన దీప్తి శర్మ 13 స్థానాలు మెరుగుపర్చుకుంది.
బౌలింగ్ విభాగానికొస్తే.. భారత్ తరఫున దీప్తి శర్మ (4) ఒక్కరే టాప్-10లో ఉన్నారు. సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ఆష్లే గార్డ్‌నర్, మెగాన్ షట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ట్రై సిరీస్‌లో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్నేహ్ రాణా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ 34వ స్థానానికి ఎగబాకింది. రాణా దాదాపు 16 నెల తర్వాత టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చింది.
కాగా, భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై నేషన్ సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మంధన సెంచరీతో కదంతొక్కడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ మంధనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.