
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో పరిస్థితులను సరిగా అంచనా వేయడంలో విఫలమయ్యాయని, అందుకే పరాజయం ఎదురైందని భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన అభిప్రాయపడింది. శనివారం లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ పోరులో భారత్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్ మహిళల జట్టు సిరీస్‌ను 1–1తో సమం చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో కుదించిన ఈ మ్యాచ్‌లో మన బ్యాటర్లు విఫలం కాగా, స్మృతి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ‘పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మా బ్యాటింగ్ బృందం విఫలమైంది.
కొన్ని అనవసరపు షాట్లకు ప్రయతి్నంచడంతో తప్పిదం జరిగింది. లార్డ్స్ మైదానంలో అలాంటి షాట్లు ఆడటం సరైంది కాదు. ముఖ్యంగా వర్షం కూడా లయ తప్పడానికి ఒక కారణం. ఇలాంటి మ్యాచ్‌లలో పదే పదే విరామాలతో ఏకాగ్రత కోల్పోతాం. టాస్ ఓడిపోవడం కూడా ప్రతికూలంగా మారుతుంది. అయినా సరే మేం మరికొంత మెరుగ్గా ఆడాల్సింది. జట్టులో చాలా మందికి ఈ మైదానంలో ఇదే తొలి మ్యాచ్. వారంతా ఉత్సాహంగా బరిలోకి దిగారు. కొన్ని జ్ఞాపకాలతో పాటు మరికొన్ని విషయాలు వారు ఇక్కడే నేర్చుకున్నారు’ అని స్మృతి వ్యాఖ్యానించింది. 2017లో లార్డ్స్ మైదానంలోనే జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
అయితే ఆ తర్వాత ఎంతో ఎదిగిన భారత జట్టు గత ఎనిమిదేళ్లలో తమ స్థాయిని పెంచుకుందని భారత ఓపెనర్ గుర్తు చేసుకుంది. ‘ఫైనల్లో ఓడి నిరాశ చెందినా స్వదేశానికి తిరిగి వచ్చాక లభించిన ఆదరణ చూస్తే మహిళల క్రికెట్‌కు దక్కుతున్న గుర్తింపు ఏమిటో అర్థమైంది. గత ఎనిమిదేళ్లలో మేం ఏ దేశానికి వెళ్లి ఆడినా పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు వస్తున్నారు. ఎన్నో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. ఏదైనా సరే మన మహిళల క్రికెట్‌కు లభించిన గుర్తింపుగా దీనిని చూడవచ్చు. ఇది ఎంతో మంచి విషయం’ అని స్మృతి పేర్కొంది.