పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చి కష్టాలు కొని తెచ్చుకొంటోంది. బంగ్లాదేశ్‌కు మద్దతు పలికే క్రమంలో తమ జట్టు ప్రయోజనాలను కూడా పణంగా పెట్టేందుకు సిద్ధమైంది. వెరసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో పీసీబీ సంబంధాలు చెడిపోయే ప్రమాదం తలెత్తింది.
ఐసీసీతో పెట్టుకోవద్దని వార్నింగ్
ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్లేయర్లు, క్రీడాపాలకులు పీసీబీ తీరును విమర్శిస్తున్నారు. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఫిబ్రవరి 7- మార్చి 8న మధ్య టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను తప్పించింది.
బంగ్లాను తప్పిస్తూ కఠిన నిర్ణయం
భారత్‌లో తమకు భద్రత లేదంటూ ఆరోపణలు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. ఐసీసీ పరిశీలనా బృందం అదేమీ లేదని తేల్చినా పంతం వీడలేదు. ఫలితంగా బంగ్లాను తప్పిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను వరల్డ్‌కప్ టోర్నీలో చేర్చింది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందని.. తాము కూడా వరల్డ్‌కప్‌లో ఆడేదీ లేనిది ఈ వారంలోగా వెల్లడిస్తామని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్ నుంచి వైదొలగాల్సిన అవసరమైతే లేదని ఆ దేశ మాజీలు అంటున్నారు.
చెడగొట్టుకోవద్దు
‘బంగ్లాదేశ్‌కు అండగా నిలవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వరల్డ్‌కప్‌నకు జట్టును పంపకపోవడానికి కారణమేముంది. అనవసరంగా ఐసీసీతో సంబంధాలను చెడగొట్టుకోవద్దు’ అని పీసీబీ మాజీ కార్యదర్శి ఆరిఫ్ అలీ అన్నారు.
‘వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించడానికి ముందు జరిగిన సమావేశంలో బంగ్లా బోర్డుకు కేవలం పాకిస్తాన్ మాత్రమే మద్దతు తెలిపింది. అయితే బంగ్లా ప్రతిపాదనను తిరస్కరించిన ఐసీసీ వరల్డ్‌కప్ నుంచి తప్పించింది’ అని పీసీబీ మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ తెలిపారు.
పాక్ క్రికెట్ తీవ్రంగా నష్టపోతుంది
పాక్ మాజీ చీఫ్ సెలెక్టర్ మొహసిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘మనకు భారత్‌తో విబేధాలు ఉన్నాయి. కానీ మనం ఆడనున్న మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు వరల్డ్‌కప్ కోసం జట్టును పంపకపోవడానికి కారణమేముంది. అదే జరిగిన పాక్ క్రికెట్ తీవ్రంగా నష్టపోతుంది’ అని అన్నాడు.
మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ... ‘పాకిస్తాన్ వరల్డ్‌కప్‌లో ఆడాలని కోరుకుంటున్నా. మన దగ్గర మంచి ప్లేయర్లు ఉన్నారు. మన జట్టు ప్రపంచకప్ వంటి పెద్ద వేదికలపై మెరుగైన ప్రదర్శన చేస్తుంటే చూడటం బాగుంటుంది’ అని అన్నాడు.
పాకిస్తాన్ కోసం
కాగా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తటస్థ వేదికలపై ఇరు జట్లు ఐసీసీ ఈవెంట్లలో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆతిథ్యం ఇస్తున్నా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను మరో వేదికగా ఎంపిక చేసింది ఐసీసీ. అయితే, పీసీబీ మాత్రం ఐసీసీ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా.. బంగ్లాదేశ్ కోసమంటూ టోర్నీ నుంచి వైదొలుతామంటూ అతి చేస్తోంది.
చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!


