500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టొచ్చు
ఈ దశాబ్దం ఆఖరు నాటికి 100 బిలియన్ డాలర్లు సాధిస్తాం
ఇంధన వారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
పెట్టుబడులతో ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు పిలుపు
బేతుల్(గోవా): సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై మనదేశం పరుగులు తీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇంధన రంగంలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. వేగవంతమైన సంస్కరణలు, విప్లవాత్మక చర్యలతో ఇంధన భద్రత నుంచి ఇంధన స్వతంత్రత దిశగా భారత్ ముందుకు సాగుతోందని వివరించారు. మంగళవారం గోవాలో ‘భారత ఇంధన వారోత్సవం–2026’లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దేశ ఇంధన రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చమురు, సహజ వాయువు అన్వేషణ, వెలికితీత కోసం 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.
చమురు, గ్యాస్ వెలికితీత కోసం ఇప్పటికే 170 బ్లాక్‌లు కేటాయించామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా భారత్ అవతరించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అండమాన్ నికోబార్ బేసిన్ హైడ్రోకార్బన్ ఉత్పత్తి కేంద్రంగా మారబోతోందని అన్నారు. మనం ఉపయోగించుకుంటున్న మొత్తం ఇంధనంలో సహజ వాయువు వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచబోతున్నట్లు వి వరించారు. దీనివల్ల ఎన్‌ఎన్‌జీ, పైపులైన్ల తయారీలో కొత్తగా అందుబాటులోకి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థ నానాటికీ బలోపేతం అవుతోందని, ఫలితంగా రాబోయే రోజుల్లో పెట్రోకెమికల్స్‌కు డిమాండ్ మరింత పెరుగుతుందని అన్నారు.
మాతో చేతులు కలపండి
భారత ఇంధన రంగంలో నేడు వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దేశ విదేశాల పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ రికార్డుకెక్కిందని, దేశంలో ఇంధన ఉత్పత్తులకు డిమాండ్ స్థిరంగా పెరుగుతోందని గుర్తుచేశారు. అంతర్జాతీయ డిమాండ్‌ను సైతం తీర్చేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలో టాప్–5లో ఒకటిగా నిలుస్తోందన్నారు. 150కి పైగా దేశాలకు ఎగుమతు లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో భారత సామర్థ్యం విదేశీ భాగస్వాములకు తోడ్పడుతుందని ఉద్ఘాటించారు. తమతో చేతులు కలపాలని, ఇక్కడున్న అవకాశాలు ఉపయోగించుకోవాలని విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. చమురు, గ్యాస్ అన్వేషణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, సముద్ర మంథన్ మిషన్‌లో భాగంగా సముద్రాల అంతర్భాగంలో వనరుల కోసం అన్వేషణ సాగిస్తున్నామని వివరించారు.


