93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత | Massive trade agreement between India and EU in world history | Sakshi
Sakshi News home page

93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత

Jan 28 2026 2:58 AM | Updated on Jan 28 2026 2:58 AM

Massive trade agreement between India and EU in world history

భారత్, ఈయూ నడుమ ప్రపంచ చరిత్రలోనే భారీ వాణిజ్య ఒప్పందం

ఈయూ నేతలతో ఫలించిన మోదీ చర్చలు 

ఆర్నెల్లలో సంతకాలు, ఏడాదిలోపు అమల్లోకి 

ట్రంప్‌ టారిఫ్‌లకు సరైన సమాధానం: విశ్లేషకులు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైన నేపథ్యంలో చేతులు కలిపి హర్షం వ్యక్తం చేస్తున్న యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లెయన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో నూతన శకానికి తెర లేచింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న భారత్, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నడుమ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఖరారైంది. యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లెయన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జరిపిన శిఖరాగ్ర చర్చల్లో ఈ చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. పరిమాణంతో పాటు ప్రాధాన్యతపరంగా కూడా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలన్నింటికీ ఈ ఎఫ్‌టీయూ తల్లి వంటిదని(మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌) పరిశీలకులు అభివర్ణిస్తున్నారు! ఇది అమల్లోకి వస్తే ఇరు పక్షాల నడుమ వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల మేరకు తగ్గనున్నాయి. 

యూరప్‌ కార్లు, వైద్య పరికరాలు, వైన్‌ తదితరాలపై టారిఫ్‌లు దిగొస్తాయి. మొత్తంగా అక్కడి దేశాల దిగుమతులన్నింటిపైనా సుంకాలు భారీగా తగ్గుతాయి. యంత్ర పరికరాలు, రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులపై ప్రస్తుతమున్న భారీ టారిఫ్‌లు దాదాపుగా కనుమరుగవుతాయి. బదులుగా ఆ ఖండానికి భారత ఎగుమతుల్లో చాలావాటిపై సుంకాలు వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 90 నుంచి 100 శాతం దాకా తగ్గనున్నాయి! ఈ తగ్గింపు వస్తూత్పత్తులతో పాటు సేవలకు కూడా వర్తించనుంది!! మొత్తమ్మీద 93 శాతం వస్తువులపై సుంకాల ఎత్తివేతకు ఇరు పక్షాలూ అంగీకరించాయి. 

ఈ ఒప్పందం కోసం ఇరు పక్షాల నడుమ 18 ఏళ్లకు పైగా చర్చోపచర్చలు కొనసాగుతుండటం విశేషం. అయితే ఎఫ్‌టీఏపై లాంఛనంగా సంతకాలు జరిగేందుకు కనీసం మరో ఆర్నెల్లు, అది అమల్లోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టనుంది. ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన, ఇతరత్రా అంశాలపై ఇరువైపులా పూర్తిస్థాయి అధ్యయనం తదితరాలు జరగాల్సి ఉండటమే ఇందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొంతకాలంగా ప్రపంచ దేశాలపై టారిఫ్‌లను ఆయుధంగా ప్రయోగిస్తూ హడలెత్తిస్తుండటం తెలిసిందే. 

ఆ వాణిజ్య బెదిరింపులకు భారత్, ఈయూ ఒప్పందాన్ని దీటైన సమాధానంగా పరిగణిస్తున్నారు. ఎఫ్‌టీఏకు తోడుగా ద్వైపాక్షిక వాణిజ్యానికి ఊపునిచ్చే దిశగా మరో 12 ఒప్పందాలు కూడా శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఖరారయ్యాయి. వాటితో పాటు మరో రెండు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా ఖరారయ్యాయి. వాటిలో ఒకటి రక్షణ–భద్రతకు సంబంధించినది కాగా మరొకటి భారత్‌ నుంచి ప్రతిభావంతులను యూరప్‌లో మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు తదితరాలు కల్పించేందుకు వీలు కల్పించేది. 

ప్రపంచానికే స్థిరత్వం: మోదీ 
ఎఫ్‌టీఏ ఖరారుపై మోదీ హర్షం వెలిబుచ్చారు. ఒప్పందం అనంతరం ఉర్సులా, కోస్టాతో కలిసి ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. వాణిజ్యపరంగా అంతర్జాతీయంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్, ఈయూ భాగస్వామ్యం ప్రపంచానికి అత్యవసరమైన స్థిరత్వాన్ని అందిస్తుందని మోదీ విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘భారత్‌ తన చరిత్రలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూరప్‌ మార్కెట్‌తో మన చిన్న పరిశ్రమలు, రైతులకు అనుసంధానం మరింత పెరిగేందుకు, ఉత్పత్తి, సేవా రంగాల్లో నూతన అవకాశాల సృష్టికి ఇది ఎంతగానో తోడ్పడనుంది. 

ఎఫ్‌టీతో భారత్, ఈయూ మధ్య పెట్టుబడులు ఇతోధికంగా పెరగనున్నాయి. నూతన ఇన్నొవేషన్‌ భాగస్వామ్యాలు ఏర్పడటమే గాక అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు మరింత బలోపేతం కానున్నాయి. ఆ కోణంలో చూస్తే ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, భారత్‌–ఈయూ సమైక్య ప్రగతికి బ్లూప్రింట్‌ వంటిది’’అంటూ ప్రధాని కొనియాడారు. ఇరు పక్షాల నడుమ ఈ భాగస్వామ్యం అంతిమంగా ప్రపంచానికే ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండో–పసిఫిక్‌ మొదలుకుని కరీబియన్‌ దీవుల దాకా పలు ప్రాజెక్టుల విషయంలో భారత్, ఈయూ కలిసి పని చేస్తాయని ప్రకటించారు. 

సవాళ్లకు సమాధానం: ఉర్సులా 
భారత్, ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక మైలురాయి వంటిదని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లెయన్‌ అన్నారు. వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుతున్న వేళ ఈ ఒప్పందానికి ఎనలేని ప్రాధాన్యం సమకూరిందని అమెరికా ఒంటెత్తు పోకడలను ఉద్దేశిస్తూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యపరంగా ప్రస్తుతం దేశాలన్నీ ఎదుర్కొంటున్న పెను అంతర్జాతీయంగా సవాళ్లకు పరస్పర సహకారం, సమన్వయమే అత్యుత్తమ పరిష్కారమని ఈ ఒప్పందం మరోసారి సందేశమిచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘మేం సాధించాం. ఒప్పందాలన్నింటికీ తల్లిగా చెప్పదగ్గ ఎఫ్‌టీఏను కుదుర్చుకున్నాం. ఏకంగా 200 కోట్ల మందికి అద్భుతమైన మార్కెట్‌ను ఏర్పాటు చేసుకోనున్నాం. 

ఇది ప్రపంచంలో రెండో, నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా నిలిచిన రెండు దిగ్గజాల గాథ. ఇరు పక్షాలకూ లాభదాయకమైన రీతిలో ఒప్పందం కుదిరింది’’అని ఉర్సులా పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో భారత, యూరప్‌ ఎగుమతిదారులపై వార్షిక సుంకాలు ఏకంగా 400 కోట్ల యూరోల దాకా తగ్గుతాయని చెప్పారు. అంతేగాక ఇరువైపలా లక్షలాది నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘‘భారత నైపుణ్యాలు, సేవలు, యూరప్‌ టెక్నాలజీ, పెట్టుబడులు, ఇన్నొవేషన్లు పరస్పరం అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఇరు పక్షాలూ ఊహించలేని స్థాయిలో ప్రగతి సాధిస్తాయి. ఒంటరిగా వెళ్తే భారత్, ఈయూల్లో ఏ ఒక్కరికీ ఆ స్థాయి ప్రగతి సాధ్యం కాదు’’అని ఆమె స్పష్టం చేశారు. ‘‘ఎఫ్‌టీఏ ద్వారా రెండు ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడంతో పాటు భారత్, ఈయూ పౌరులకు భద్రత మరింత మెరుగవనుంది. నానాటికీ అభద్రత పెరిగిపోతున్న నేటి ప్రపంచంలో ఇది అత్యంత కీలకమైన అంశం’’అని ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

మైలురాయి వంటిది: కోస్టా 
భారత్, ఈయూ ఎఫ్‌టీఏను వాణిజ్య ఒప్పందాల చరిత్రలోనే మైలురాయిగా యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, వ్యూహత్మక అంశాల్లో సహకారమే పునాదులుగా ఒప్పందం కుదిరిందన్నారు. అందుకే ఇది ఎనలేని చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు. 

 చర్చలే శాంతికి మార్గం 
యుద్ధాలతో శాంతి ఎన్నటికీ సాధ్యం కాదని భారత్, ఈయూ శిఖరాగ్ర సదస్సులో నేతలు అభిప్రాయపడ్డారు. పరస్పర విశ్వాసంతో కూడిన చర్చలే అందుకు ఏకైక మార్గమని ప్రధాని మోదీ, ఈయూ సారథులు ఉర్సులా, ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో స్థితిగతులు, ఇండో–పసిఫిక్‌లో పరిస్థితులు తదితరాలపై వారితో లోతుగా చర్చలు జరిగినట్టు మోదీ వెల్లడించారు. 

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు చెప్పారు. యుద్ధాలతో ఎన్నటికీ శాంతిని సాధించలేమని ఉక్రెయిన్‌ ఘర్షణను ఉద్దేశించి ఉర్సులా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్వం ద్వారా శాంతిసాధన యత్నాల్లో యూరప్‌ కూడా మోదీవైపు నమ్మకంతో చూస్తోందని కోస్టా పేర్కొనడం విశేషం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement