అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్‌గా సిమ్రన్‌జీత్‌ కౌర్‌ | Simranjeet Kaur Set To Be Punjab First Woman Boxer To Turn Professional, More Details Inside | Sakshi
Sakshi News home page

అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్‌గా సిమ్రన్‌జీత్‌ కౌర్‌

May 22 2025 10:00 AM | Updated on May 22 2025 10:16 AM

Simranjeet Kaur Set to Be Punjab First Professional Woman Boxer

న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్‌ సిమ్రన్‌జీత్‌ కౌర్‌ ప్రొఫెషనల్‌గా మారనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన 29 ఏళ్ల సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (Simranjeet Kaur)... అమెరికా మాజీ బాక్సర్‌ రాయ్‌ జోన్స్, భారత బాక్సర్‌ మన్‌దీప్‌ జాంగ్రాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది భారత్‌ నుంచి నిశాంత్‌ దేవ్, అమిత్‌ పంఘాల్‌ ప్రొఫెషనల్‌గా మారగా... ఇప్పుడు ఆ జాబితాలో సిమ్రన్‌జీత్‌ కూడా చేరింది.

కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సిమ్రన్‌జీత్‌... ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పలు పతకాలు నెగ్గింది. ఈ ఏడాది జాతీయ చాంపియన్‌షిప్‌ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన కౌర్‌... అమెచ్యూర్‌ బాక్సింగ్‌ నుంచి ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

అతడి బాటలోనే నడుస్తూ
‘ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మన్‌దీప్‌ జాంగ్రా ఇప్పటికే దేశం గర్వపడే విజయాలు సాధించారు. అతడి బాటలోనే నడుస్తూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు నావంతు ప్రయత్నం చేస్తా. 

ఈ ప్రయాణంలో రాయ్‌ జోన్స్‌ సహకారం మరవలేను’ అని సిమ్రన్‌జీత్‌ పేర్కొంది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌... దేశం నుంచి తొలి ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారగా... ఆ తర్వాత వికాస్‌ కృషన్, సరితా దేవి, నీరజ్‌ గోయత్‌ వంటి పలువురు బాక్సర్లు ప్రొఫెషనల్స్‌గా మారారు. కాగా పంజాబ్‌ నుంచి తొలి మహిళా ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా సిమ్రన్‌ నిలవనుండటం విశేషం. 

భారత జట్టు పసిడి బోణీ
న్యూఢిల్లీ: జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత జట్టు పసిడి బోణీ కొట్టింది. జర్మనీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హరియాణాకు చెందిన యువ షూటర్‌ కనక్‌ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో బుధవారం 17 ఏళ్ల కనక్‌ 239 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 8 మంది షూటర్లు పాల్గొన్న 24 షాట్ల తుదిపోరులో కనక్‌ తన గురితో అదరగొట్టింది.

‘ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది.’ అని కనక్‌ వెల్లడించింది. మాల్దోవాకు చెందిన అన్నా డుల్స్‌ 1.7 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా... చెన్‌ యెన్‌ చింగ్‌ (చైనీస్‌ తైపీ) కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో భారత్‌ నుంచి ఇద్దరు షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. కనక్‌ 571 పాయింట్లతో, ప్రాచి 572 పాయింట్లతో తుదిపోరుకు చేరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement