
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరికి వచ్చిన ఫోర్టిస్.. పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు.
అతడి మాటలకు గంభీర్‌కు చిర్రెత్తుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రధాన కోచ్ పిచ్ క్యూరేటర్‌తో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ సైతం లీ ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వివాదంపై టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. లీ ఫోర్టిస్‌పై గిల్ అగ్రహం వ్యక్తం చేశాడు.
"నా కెరీర్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. మ్యాచ్‌కు ముందు ప్రధాన పిచ్‌ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని ఇప్పటివరకు ఏ క్యూరేటర్ కూడా నాతో చెప్పలేదు. రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్(చెప్పులు లేకుండా) తో పిచ్‌ను దగ్గరగా వెళ్లి పరిశీలించవచ్చు. మాకు రూల్స్ తెలుసు.
ఒకవేళ స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే క్యూరేటర్ మమ్మల్ని అడ్డుకోవచ్చు. కానీ మేము అటువంటి షూలను ధరించలేదు. అయినా క్యూరేటర్ మమ్మల్ని ఎందుకు ఆపాడో ఆర్ధం కావడం లేదు. మేము ఇప్పటివరకు ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాము. ఏ క్యూరేటర్ కూడా మాకు ఇలాంటి సూచనలు ఇవ్వలేదు" అని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.
కాగా ఐదో టెస్టు గురువారం నుంచి ఓవల్ మైదానం వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం ఎలాగైనా పర్యటక జట్టును ఓడించి 3-1 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. అర్ష్‌దీప్ అరంగేట్రం! అతడికి మరోసారి నో ఛాన్స్?