
మాంచెస్టర్‌లో టీమిండియా అద్బుతం చేసింది. ఓటమి తప్పదనుకున్న చోట భారత ఆటగాళ్లు తమ విరోచిత పోరాటంతో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రాగా ముగించారు. దాదాపు రెండు రోజుల పాటు ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురీది మరి మ్యాచ్‌ను తమ చేజారకుండా కాపాడుకున్నారు.
సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కెప్టెన్ శుబ్‌మన్ గిల్(103), కేల్ రాహుల్(90) తమ అద్బుత బ్యాటింగ్‌లతో ఆదుకోగా.. ఆ తర్వాత రవీంద్ర జడేజా(185 బంతుల్లో 107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(206 బంతుల్లో 101 నాటౌట్) ఆజేయ శతకాలతో భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు.
వీరిద్దరి అసమాన పోరాటానికి ఇంగ్లీష్ జట్టు ప్లేయర్లు తమ సహనాన్ని కోల్పోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు, ఆర్చర్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ డ్రా గా ముగియడంతో సిరీస్‌ను సమం చేసే అవకాశం టీమిండియాకు లభించింది. ఇక మాంచెస్టర్ టెస్టు డ్రా ముగియడంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.
తమ ఆటగాళ్ల అసాధారణ పోరాటంపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "కీలకమైన మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే వికెట్లు పడితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది.
నాలుగో రోజును కేఎల్ భాయ్, నేను జాగ్రత్తగా ఆడి ముగించాము. ఐదో రోజు పిచ్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో? అనే ఆందోళన నెలకొంది. అందుకే ప్రతీ బంతిని కూడా జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకున్నాము.
అందుకే షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు..
మేం ప్రతీ బంతిని ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను వీలైనంత ఆఖరివరకు తీసుకెళ్లాలనుకున్నాం. జడేజా, సుందర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ తమ సెంచరీలకు చేరువలో ఉన్నారు. వారు సెంచరీలు చేసేందుకు ఆర్హులు, అందుకే డ్రాను అంగీకరించేందుకు కరచాలనం చేయలేదు.
ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఆఖరి రోజు, చివరి సెషన్ వరకు సాగింది. ఈ సిరీస్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము. ప్రతీ టెస్టు మ్యాచ్ కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. మా ఆఖరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయత్నిస్తాము.
ప్రతీసారి కాస్త ఒత్తిడి..
నిజాయితీగా చెప్పాలంటే గతంలో ఎన్ని పరుగులు చేశారనేది ముఖ్యం కాదు. వైట్ జెర్సీ ధరించి దేశం కోసం ఆడిన ప్రతీసారి కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. అప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. అప్పుడే ఆటను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేస్తుంది.
నేను బ్యాటింగ్ చేసే ప్రతీ సారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటా. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటునాను. తొలి ఇన్నింగ్స్‌లో మేము మంచి స్కోర్ సాధించాము. కానీ మా బ్యాటర్లలో చాలా మంది తమకు లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లగా మలచడంలో విఫలమయ్యారు.
ఇలాంటి వికెట్‌పై ఒకరిద్దరు బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ మేము అలా చేయలేకపోయాము. ఇక బుమ్రా ఫిట్‌నెస్ గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను. అదేవిధంగా మేం మ్యాచ్ గెలుస్తున్నంత కాలం టాస్ గురించి కూడా పట్టించుకోమని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)
భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్‌మన్ గిల్ 103, జడేజా 107 నాటౌట్, సుందర్ 101 నాటౌట్, క్రిస్ వోక్స్ 2/67)
చదవండి: పోరాటం కూడా గర్వించేలా...