
నాలుగో టెస్టులో టీమిండియా ‘ద గ్రేట్ ఎస్కేప్’
గిల్, జడేజా, సుందర్ శతకాల పోరాటం
ఇంగ్లండ్‌తో భారత్ నాలుగో టెస్టు ‘డ్రా’
పేలిపోయిన భారత బ్యాటింగ్
తేలిపోయిన ఇంగ్లండ్ బౌలింగ్
ఈనెల 31 నుంచి ఐదో టెస్టు
ఇది నాలుగో రోజు సంగతీ! ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైనపుడు... భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలైనపుడు 0/2 స్కోరు! 5 బంతులకే ఆ 2 వికెట్లను టీమిండియా కోల్పోయింది. తర్వాత మిగిలున్న ఆ రోజు, అనంతరం ఆఖరి రోజు కలిపి 852 బంతులు పడ్డాయి. కానీ ఇంకో రెండే వికెట్లు పడ్డాయి! జట్టు ఆలౌట్ కాలేదు. ఇంగ్లండ్ నెగ్గలేదు. కానీ భారత్ నెగ్గింది. అదేంటి మ్యాచ్ ‘డ్రా’ కదా అయింది. భారత్ గెలిచిందంటారేంటి? అనే సందేహం రావొచ్చు.
అవును... నిజమే. ఫలితం ముమ్మాటికి ‘డ్రా’నే! డౌటయితే లేదు టెస్టులో! కానీ భారత్ గెలిచింది ఫైట్‌లో! ఇన్నింగ్స్ పరాజయం తప్పదనుకున్న చోట... నాలుగున్నర సెషన్లు మిగిలిన ఆటలో... శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ముగ్గురి ‘త్రి’ శతకాల శక్తి... ఎంతటి ప్రతికూలతలనైనా తట్టుకొని నిలబడగలదనే స్ఫూర్తిని రగిల్చింది. మొత్తానికి భారత జట్టు పోరాటం కూడా గర్వపడేలా అసాధారణ ఆటతీరుతో నాలుగో టెస్టును ‘డ్రా’గా ముగించింది. ఈ సిరీస్‌లోని చివరిదైన ఐదో టెస్టు ఈనెల 31 నుంచి ఓవల్‌లో జరుగుతుంది.
మాంచెస్టర్: ‘ఘోర పరాజయం తప్పదు’! ‘నాలుగో రోజు ఆట ముగిసేలోపే స్పెషలిస్టు బ్యాటర్లెవరూ మిగలరు’! ‘టెయిలెండర్ల వికెట్లు ఆఖరి రోజు మొదలవడంతోనే పడిపోతాయి’! ‘ఇంగ్లండ్ బౌలింగ్ దెబ్బకు ఇన్నింగ్స్ పరాజయం తప్పదు’! ‘ఇంగ్లండ్‌కు 3–1తో సిరీస్ విజయం ఖాయం’! ఇవన్నీ కూడా నాలుగో రోజు ఆఖరి సెషన్‌కు ముందు మాంచెస్టర్ ముచ్చట్లు!! కానీ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి అదే మాంచెస్టర్‌లో చప్పట్లు! అంచనాలన్నీ తలకిందులు. విశ్లేషణలన్నీ పటాపంచలు.
భారత్‌ను తక్కువ చేసిన నోళ్లే... టీమిండియా ఆటగాళ్లు గొప్పొళ్లు అని పొగిడాయి. 311 పరుగులు వెనుకబడిన జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో పరుగైనా చేయకుండానే 2 వికెట్లు కోల్పోయిన జట్టు మలి రోజు (తర్వాతి ఐదో రోజు) కూడా రెండే వికెట్లు కోల్పోవడమేంటి. ఇది సాధారణ టెస్ట్! కానీ టీమిండియా పోరాటం గ్రేటెస్ట్. సంప్రదాయ క్రికెట్‌లో ఇటు గెలవకుండా... అటు ఓడకుండా... ‘డ్రా’తోనే పుటల్లోకెక్కిన ఘనతంటూ దక్కితే ముమ్మాటికి అది భారత్‌కే దక్కుతుందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.
శతకాల పరాక్రమం
‘టెండూల్కర్–అండర్సన్ ట్రోఫీ’లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు ఎవరూహించని విధంగా ‘డ్రా’గా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 174/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ గ్రే‘టెస్టు’ ముగిసే సమయానికి 143 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. 2... 2... అంటే ఇంగ్లండ్ బౌలర్లు నాలుగో రోజు, ఐదో రోజు తీసిన వికెట్ల సంఖ్య అది. 3... భారత దళంలో ఇంగ్లండ్‌ను వందలకొద్దీ బంతులనునెదుర్కొని సాధించిన శతకాల సంఖ్య.
కేఎల్ రాహుల్ (230 బంతుల్లో 90; 8 ఫోర్లు) వికెట్టే ఇంగ్లండ్ శిబిరానికి దక్కిన ఏకైక ఆనందం. ఎందుకంటే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (238 బంతుల్లో 103; 12 ఫోర్లు)ను అవుట్ చేసినా అప్పటికే అతను శతకం సాధించేశాడు. ఇక మరో వికెట్ పడితే ఒట్టు! అన్నట్లుగా రవీంద్ర జడేజా (185 బంతుల్లో 107 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (206 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) తొలి సెషన్ నుంచి ఆఖరి సెషన్ ఆట ముగించమని ప్రత్యర్థి కెప్టెన్ ప్రార్థించేంతవరకు కనికరించకుండా ఆడేశారు. శతకాలు పూర్తి చేశారు.
భారత్‌ను ఈ టెస్టులోనే కాదు... సిరీస్‌ను ఓడకుండా కాపాడారు. ఇప్పటికి 2–1తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ భారత్‌కు లభించిన ఈ సమరోత్సాహంతో ఐదో టెస్టును సానుకూల దృక్పథంతో మొదలుపెట్టడం ఖాయం.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 358; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) రూట్ (బి) వోక్స్ 0; కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్ 90; సాయి సుదర్శన్ (సి) బ్రూక్ (బి) వోక్స్ 0; శుబ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 103; వాషింగ్టన్ సుందర్ (నాటౌట్) 101; రవీంద్ర జడేజా (నాటౌట్) 107; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (143 ఓవర్లలో 4 వికెట్లకు) 425.
వికెట్ల పతనం: 1–0, 2–0, 3–188, 4–222. బౌలింగ్: క్రిస్ వోక్స్ 23–4–67–2, ఆర్చర్ 23–3–78–1, బ్రైడన్ కార్స్ 17–3–44–0, డాసన్ 47–11–95–0, జో రూట్ 19–2–68–0, బెన్ స్టోక్స్ 11–2–33–1, బ్రూక్ 3–0–24–0.
ఆపేద్దాం... ఆడతాం!
ఆఖరి రోజు ఆటలో... ఆఖరి గంటలో... ఆపేద్దామంటే, ఆడేద్దామనే డ్రామా చోటు చేసుకుంది. చివరి సెషన్‌లో ఇక గంట ఆటే మిగిలుంది. 15 ఓవర్లు పడాల్సి ఉంది. ఫలితం తేలని సందర్భాల్లో ఆ కనీస ఓవర్లకు ముందే ఇరు జట్ల కెప్టెన్లు పరస్పర సమ్మతితో ‘డ్రా’ పాట పాడే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం ప్రయత్నించి ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ భంగపడ్డాడు. స్టోక్స్‌కు మింగుడుపడని విధంగా అసలేం జరిగిందంటే... 138 ఓవర్లలో భారత్ స్కోరు 386/4. 75 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇక మిగిలిపోయిన ఆ 15 ఓవర్లతో ఆలౌట్ చేయడం, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం, ఇంగ్లండ్ గెలవడం జరిగేది కాదని అర్థమైంది. దీంతో అలసిన సహచరులకు కాస్త ముందుగానే విశ్రాంతినిద్దామనే ఆలోచనతో స్టోక్స్ డ్రా కోసం ‘ఇక చాలు ఆపేద్దాం’ అన్నాడు. కానీ అవతలి వైపు జడేజా (89 బ్యాటింగ్), సుందర్ (80 బ్యాటింగ్) సెంచరీలకు దగ్గరవడంతో భారత దళం ‘కుదరదు... ఆడేద్దాం’ అంది.
స్టోక్స్ ప్రతిపాదనను జడేజా తోసిపుచ్చాడు. క్రీజులో ఉన్న ఇద్దరం శతకరేసులో ఉన్నామన్నాడు. దీంతో చేసేదేమీలేక చిన్నబుచ్చుకున్న స్టోక్స్ సులువైన బౌలింగ్‌నే పురమాయించాడు. ఫోరు, సిక్స్‌తో జడేజా... తర్వాత బౌండరీలతో సుందర్ చకచకా సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఈ ఆఖరి దూకుడుతో 5 ఓవర్ల వ్యవధిలో భారత్ 39 పరుగులు చేసింది. 400 స్కోరునూ దాటింది.
4 ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో గిల్ సెంచరీల సంఖ్య. ఒకే సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో గావస్కర్ (1971, 1979లో వెస్టిండీస్‌పై; 4 చొప్పున), కోహ్లి (2014–15 సిరీస్‌లో ఆస్ట్రేలియాపై; 4 సెంచరీలు ) కూడా ఉన్నారు.
3 ఒకే టెస్టు సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో కెప్టెన్‌గా గిల్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (1947–48లో భారత్‌పై), సునీల్ గావస్కర్ (1978–79లో వెస్టిండీస్‌పై) కూడా ఉన్నారు.