ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI WC)లో సెమీ ఫైనల్ చేరిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ ప్రతికా రావల్ (Pratika Rawal) గాయం వల్ల జట్టుకు దూరమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.
ప్రతికా రావల్ స్థానంలో అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ జట్టులోకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. ఇంతకీ ఎవరా ప్లేయర్ అంటే?!...
కుడికాలి చీలమండకు గాయం
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్ సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటి గెలుపొందాలని భావించింది. అయితే, నవీ ముంబై వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసి పోయింది.
వాన వల్ల 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అయితే, ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రతికా రావల్ కుడికాలి చీలమండకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె మైదానం వీడింది. ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌కు రాలేదు.
మంధానకు జోడీగా అమన్‌జోత్ కౌర్
ప్రతికా రావల్ స్థానంలో స్మృతి మంధాన (34 నాటౌట్)కు ఓపెనింగ్ జోడీగా అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) వచ్చింది. అయితే, వర్షం ఎక్కువ కావడంతో 8.4 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి హర్మన్ సేన వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.
కాగా ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. గువాహటిలో అక్టోబరు 29న తొలి సెమీస్ మ్యాచ్ జరుగనుండగా.. ఇందులో ఇంగ్లండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. మరోవైపు.. భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ (అక్టోబరు 30) జరుగనుండగా.. ఇందుకు నవీ ముంబై వేదిక.
లేడీ సెహ్వాగ్ వచ్చేసింది
అయితే, పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో కీలక సెమీస్‌కు ముందు ఇన్‌ఫామ్ బ్యాటర్ ప్రతికా సేవలను భారత్ కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’గా పేరొందిన షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది.

కాగా సెమీస్ మ్యాచ్‌లో జట్టు మార్పు నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈవెంట్ టెక్నికల్ కమిటీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఇక భారత జట్టు ఓపెనర్‌గా కొంతకాలం వెలుగొందిన షఫాలీ వర్మ.. తర్వాత ఫామ్‌లేమితో సతమతమైంది.
527 పరుగులు సాధించి..
అదే సమయంలో ప్రతికా రావల్ రావడం.. నిలకడగా ఆడటంతో జట్టులో షఫాలీ స్థానం గల్లంతైంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. కాగా షఫాలీ చివరగా 2024, అక్టోబరులో భారత్ తరఫున వన్డే ఆడింది.
ఇక గతేడాది హర్యానా తరఫున దేశీ వన్డే క్రికెట్‌లో షఫాలీ మెరుగ్గా రాణించింది. 75.28 సగటుతో 527 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ప్రతికా రావల్.. 23 ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకుంది.
తద్వారా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. మంధానతో కలిసి 23 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ వికెట్‌కు ప్రతికా ఏకంగా 1799 పరుగులు జతచేసి రికార్డు సృష్టించడం గమనార్హం. ఏదేమైనా చాంపియన్ జట్టు ఆసీస్‌తో పోరులో ప్రతికా లేని లోటు స్పష్టంగా తెలుస్తుందనడంలో సందేహం లేదు. కాగా సారథిగా షఫాలీ భారత్‌కు అండర్-19 ప్రపంచకప్-2023 అందించిన విషయం తెలిసిందే.
చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్


