గంభీర్ (PC: BCCI)
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఆసీస్‌తో మూడో వన్డేలో దుమ్ములేపారు.
168 పరుగులు భాగస్వామ్యం
ఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం (125 బంతుల్లో 121*)తో చెలరేగగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి 74 పరుగులతో చెలరేగి.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ వెటరన్ బ్యాటర్లు తమ వింటేజ్ ఇన్నింగ్స్‌ను గుర్తుచేస్తూ.. ఏకంగా 168 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
తప్పిన గండం
మరోవైపు.. అంతకు ముందు కెప్టెన్, ఓపెనర్ గిల్ (24)తో కలిసి రోహిత్ 69 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నిర్మించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. తద్వారా సిడ్నీ వన్డేలో గెలుపొంది ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది.
మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి పరువు కాపాడుకుంది. మరోవైపు.. ఆఖరిదైన ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణా తన కెరీర్‌లో తొలిసారి నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసి.. ఆసీస్‌ను 236 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
రోహిత్- గిల్ సూపర్
ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్‌కోచ్ గౌతం గంభీర్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘శుబ్‌మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది.
ఆ తర్వాత రోహిత్-విరాట్ పార్ట్‌నర్‌షిప్ అత్యద్భుతం. ముఖ్యంగా రోహిత్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అతడి ఆట తీరు అమోఘం. మ్యాచ్‌ను ముగించిన తీరు ప్రశంసనీయం. రోహిత్‌తో పాటు విరాట్ పని పూర్తి చేశాడు’’ అని గంభీర్ కొనియాడాడు.
అహంకారం వద్దు
అంతకుముందు.. ‘‘బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. హర్షిత్ అవుట్‌స్టాండింగ్ స్పెల్ వేశాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒద్దికగా.. ఒదిగి ఉండాలి. మరింత కష్టపడాలి. అహంకారం వద్దు’’ అని గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ రాణాకు సూచించాడు. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్ టూర్‌లో కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే గిల్ విఫలమయ్యాడు.
మూడు వన్డేల్లో గిల్ చేసిన స్కోర్లు వరుసగా.. 10, 9, 24. ఇక కెప్టెన్‌గానూ సిరీస్‌ను ఆసీస్‌కు 1-2తో కోల్పోయాడు. మరోవైపు.. రోహిత్ శర్మ 8, 73, 121* పరుగులతో రాణించి మూడో వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.
చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!


