సూర్యతో గంభీర్ (PC: BCCI)
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1 (Ind Loss ODI Series To Aus)తో ఓడిపోయింది. ఫలితంగా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది.
ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో మాత్రం అంత గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా టీమిండియాతో ఆడిన 32 మ్యాచ్‌లలో కంగారూ జట్టు కేవలం 11 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనం.
బ్యాటింగ్ పరంగా విఫలం
ముఖాముఖి రికార్డు పరంగా భారత్ పటిష్ట స్థితిలోనే ఉన్నా సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేము. మరోవైపు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. బ్యాటింగ్ పరంగా విఫలం కావడం కలవరపెట్టే అంశం.
గతేడాది జూలైలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్య.. 20 మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండే హాఫ్ సెంచరీలు బాదాడు. సగటు 18 కంటే తక్కువ. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇంకా కేవలం మూడు నెలల సమయమే ఉన్న వేళ సూర్య ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది.
72 పరుగులే
ఇటీవల కెప్టెన్‌గా ఆసియా టీ20 కప్-2025 టైటిల్ గెలిచిన సూర్య.. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 72 పరుగులే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై విమర్శలు వస్తుండగా.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.
ఎలాంటి భయాలు లేవు
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘సూర్య బ్యాటింగ్ ఫామ్ నన్ను ఏమాత్రం ఆందోళనకు గురిచేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి భయాలు లేవు. అల్ట్రా- అగ్రెసివ్‌గా ఆడాలని డ్రెసింగ్‌రూమ్‌లో నిర్ణయించుకున్నాం. దూకుడుగా ఆడటమే మాకు ఇష్టం.
ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకున్నపుడు వైఫల్యాలను కూడా ఆమోదించగలగాలి. ఇలాంటి అప్రోచ్ కారణంగా ఒక్కోసారి విఫలమైనా సరే.. మేము దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని గంభీర్ తెలిపాడు.
ఒక్కసారి లయ అందుకుంటే
ఇక టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు ఆసియా కప్ టోర్నీలో సూపర్ ఫామ్ కనబరిచాడు. ఏదేమైనా సూర్య ఒక్కసారి లయ అందుకుంటే బాధ్యత తన భుజం మీదు వేసుకోవడానికి ఏమాత్రం సందేహించడు.
టీ20 క్రికెట్‌లో మేము వ్యక్తిగత పరుగుల కంటే కూడా మా క్రికెట్ బ్రాండ్‌పైనే ఎక్కువగా దృష్టి పెడతాం. దూకుడైన శైలితోనే ముందుకు సాగుతాం. బ్యాటర్లు తరచూ వ్యక్తిగతంగా విఫలమైనా.. జట్టు రాణిస్తే అది పెద్దగా లెక్కలోకి రాదు’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్‌లోనూ తమ దూకుడు కొనసాగుతుందంటూ ఆస్ట్రేలియా జట్టుకు గౌతీ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా అక్టోబరు 29- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్


