సెమీస్ మ్యాచ్‌కు జట్టులో చోటు
గురువారం ఆస్ట్రేలియాతో భారత్ పోరు
ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు భారత ఓపెనర్ ప్రతీక రావల్ దూరమైంది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఆమె గాయపడింది. ఫిజియో సహాయంతో ఆమె మైదానం వీడాల్సి వచ్చింది. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ప్రతీక తర్వాతి మ్యాచ్ ఆడే అవకాశం లేదని ఖాయమైంది. ప్రతీక స్థానంలో షఫాలీ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు.
వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో షఫాలీకి చోటు దక్కలేదు. ఏడాది క్రితం షఫాలీ తన చివరి వన్డే ఆడింది. వరుస వైఫల్యాల తర్వాత ఆమె స్థానంలోనే వచ్చిన ప్రతీక తన నిలకడైన ఆటతో ఓపెనింగ్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రతీక ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో (308 పరుగులు) ఉంది.
ఇప్పుడు టీమ్‌లో ఉన్న ప్లేయర్లలో హర్లీన్, అమన్‌జ్యోత్, ఉమా ఛెత్రి, జెమీమాలతోపాటు రిజర్వ్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్‌కు కూడా ఓపెనింగ్ చేసే సామర్థ్యం ఉన్నా... వారిని కాదని రిజర్వ్ జాబితాలో కూడా లేని షఫాలీని జట్టులోకి తీసుకున్నారు.
దూకుడుకు మారుపేరైన 21 ఏళ్ల షఫాలీ కీలక మ్యాచ్‌లో స్మృతితో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనుంది. భారత్ తరఫున 29 వన్డేల్లో 23 సగటుతో షఫాలీ 644 పరుగులు చేసింది. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. టీమ్‌లో స్థానం కోల్పోయిన తర్వాత భారత ‘ఎ’ జట్టు తరఫున ఆమె నిలకడగా రాణిస్తూ పరుగులు సాధిస్తోంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.


