భారత టి20 జట్టు కెప్టెన్‌కు హెడ్ కోచ్ గంభీర్ మద్దతు
కాన్‌బెర్రా: భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. ఆసియా కప్ టోర్నీలో జట్టును విజేతగా నిలిపినా... గత 14 ఇన్నింగ్స్‌లలో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. అయితే సూర్యకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. అతని ఫామ్‌తో తమకు ఆందోళన లేదని, ఒక ప్లేయర్ బ్యాటింగ్‌కంటే ఓవరాల్‌గా జట్టు ప్రదర్శనను చూడాలని అతను అభిప్రాయపడ్డాడు. ‘ఎలాంటి స్థితిలోనైనా దూకుడుగా ఆడాలని మేమందరం కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో నిర్ణయం తీసుకున్నాం.
ఇలాంటప్పుడు సహజంగానే వైఫల్యాలు వస్తాయి. కాబట్టి సూర్య బ్యాటింగ్ గురించి మేం ఆందోళన చెందడం లేదు. 30 బంతుల్లో 40 పరుగులు చేసి అతను విమర్శల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ధాటిని కొనసాగించి విఫలమైనా నష్టం లేదని ముందే అనుకున్నాం. ప్రస్తుతం అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సూర్య ఒక్కసారి లయ అందుకుంటే తానూ దూసుకుపోతాడు. అయితే టి20ల్లో వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుకు పనికొచ్చే ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ముఖ్యం’ అని గంభీర్ వివరించాడు.
జట్టు కెపె్టన్, కోచ్‌ల మధ్య మంచి అవగాహన ఉందని, అది జట్టు ఫలితాల్లో కనిపిస్తుందని అతను అన్నాడు. ‘ఎక్కడా వెనక్కి తగ్గని టీమ్‌గా దీనిని తీర్చిదిద్దాలని మేం భావిస్తున్నాం. అందుకే వైఫల్యాలకు మేం భయపడం. ఆసియా కప్ ఫైనల్లో కూడా ఏదైనా తప్పు చేసినా ఏమీ కాదని ఆటగాళ్లను ముందే చెప్పాను. తప్పులు మానవ సహజం. అయితే దూకుడును మాత్రం ప్రదర్శించకుండా సాధారణంగా ఆడితే ప్రత్యర్థిని అవకాశం ఇచ్చినట్లే’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాన్‌బెర్రాలో రేపు జరిగే తొలి మ్యాచ్‌తో ఆస్ట్రేలియా, భారత్ జట్ల ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌కు సన్నాహకంగా సోమవారం భారత ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు.


