న్యూఢిల్లీ: భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విశ్రాంతి తీసుకోకుండా వెంటనే రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. గిల్ సారథ్యంలోని టీమిండియా 1–2తో తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆదివారమే కివీస్‌తో ఈ సిరీస్ ముగిసింది.
రోజుల వ్యవధిలోనే గురువారం నుంచి సౌరాష్ట్రతో తలపడే పంజాబ్ తరఫున రంజీ మ్యాచ్ బరిలోకి దిగేందుకు గిల్ సై అంటున్నాడు. 26 ఏళ్ల ఈ కెప్టెన్ విశ్రాంతి గురించి ఆలోచించడం లేదని, రాజ్‌కోట్‌లో జరిగే రంజీ పోరు కోసం ఇండోర్ నుంచి నేరుగా అక్కడికే పయనమవుతాడని పంజాబ్ జట్టు వర్గాలు తెలిపాయి. గత సీజన్‌లో మాదిరిగా ఈసారి కూడా రంజీ ట్రోఫీకి మధ్యలో విరామమిచ్చారు. ముస్తాక్ అలీ టి20, విజయ్ హజారే వన్డే టోరీ్నల కోసం రంజీలకు బ్రేక్ ఇచ్చారు.
ఈ రెండు పరిమిత ఓవర్ల ఈవెంట్లు ముగియడంతో గురువారం నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన రెండు రౌండ్‌ల రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్ని కొనసాగించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో పంజాబ్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడింది. ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ ఓడింది. మిగతా మూడింటిని ‘డ్రా’ చేసుకున్న పంజాబ్ 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇంకా మూడే లీగ్ మ్యాచ్‌లున్నాయి. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే ఈ మూడు మ్యాచ్‌ల్నీ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. గిల్ రాకతో పంజాబ్ పటిష్టంగా మారింది.


