SA Vs IND- Shreyas Iyer: ఇంతకు ముందు ఎవరూ అలా చేయలేదు.. అందుకే రాహుల్‌ నా ఫేవరెట్‌ కెప్టెన్‌!

Shreyas Iyer Says KL Rahul Is His Favourite Captain He Explains Why - Sakshi

Shreyas Iyer -KL Rahul: టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రశంసలు కురిపించాడు. ఎల్లవేళలా ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాడని, తన కెప్టెన్సీలో ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు. మైదానంలో రాహుల్‌ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటాడని, తన ఫేవరెట్‌ కెప్టెన్‌ అతడేనని తెలిపాడు. కాగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ విరాట్‌ కోహ్లిని తప్పించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించిన యాజమాన్యం.. కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. అయితే, సౌతాఫ్రికా టూర్‌కు ముందు రోహిత్‌ గాయపడటంతో అతడి స్థానంలో వన్డే సిరీస్‌కు రాహుల్‌ సారథిగా వ్యవహరించాడు. ఈ జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ సభ్యుడు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘‘నిజానికి రాహుల్‌ అత్యద్భుతమైన ఆటగాడు.

ఇక తన కెప్టెన్సీలో ఆడటం చాలా బాగుంటుంది. జట్టు సమావేశాల్లో, మైదానంలో ఆటగాళ్లలో తన మాటలతో ఆత్మవిశ్వాసం నిండేలా చేస్తాడు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడు. చాలా కూల్‌గా ఉంటాడు. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. నిజంగా తన సారథ్యంలో ఆడటాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. ఇంకో విషయం ఏమిటంటే.. తను నాకు బౌలింగ్‌ చేసే అవకాశం ఇచ్చాడు.

ఇంతకు ముందు ఏ కెప్టెన్‌ కూడా ఇలా చేయలేదు. కాబట్టి అతడే నా ఫేవరెట్‌ కెప్టెన్‌!’’ అని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన శ్రేయస్‌ 21 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో రాహుల్‌ నేతృత్వంలోని టీమిండియా 3-0తో వైట్‌వాష్‌కు గురై ఘోర పరాభవం మూటగట్టుకుంది.

ఇక ఐపీఎల్‌ విషయానికొస్తే రాహుల్‌.. కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ కాగా.. శ్రేయస్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథిగా ఎంపికయ్యాడు. మార్చి 26 నుంచి మెగా ఈవెంట్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో రెడ్‌బుల్‌ క్లబ్‌హౌజ్‌ సెషన్‌లో శ్రేయస్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: Shane Warne: నా గుండె నొప్పితో విలవిల్లాడుతోంది: వార్న్‌ మాజీ ప్రేయసి భావోద్వేగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top