
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా నిన్న (జులై 14) ముగిసిన మూడో టెస్ట్‌లో (లార్డ్స్) భారత్‌పై ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. లార్డ్స్ టెస్ట్‌లో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది.
ఆ జట్టు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఎడమ చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సిరీస్‌లోని తదుపరి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. బషీర్ చేతి వేలికి ఈ వారం చివర్లో శస్త్రచికిత్స జరుగనున్నట్లు ఈసీబీ తెలిపింది. బషీర్ లార్డ్స్ టెస్ట్‌లో మూడో రోజు తన బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజా (తొలి ఇన్నింగ్స్) క్యాచ్ అందుకోబోయి గాయపడ్డాడు. ఆ గాయం తర్వాత బషీర్ ఆ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు.
అయితే బషీర్ రెండో ఇన్నింగ్స్‌లో గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్‌కు దిగాడు. 9 బంతుల్లో 2 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత బషీర్ ఐదో రోజు ఎక్కువ భాగం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు.
అయితే ఛేదనలో టీమిండియా టెయిలెండర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్న దశలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బషీర్‌ను తిరిగి బరిలోకి దించాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయని బషీర్.. చాలా సేపు తమ సహనాన్ని పరీక్షించిన మహ్మద్ సిరాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ గెలుపును ఖరారు చేశాడు. ఈ సిరీస్‌లో బషీర్ 3 మ్యాచ్‌ల్లో 54.1 సగటున 10 వికెట్లు తీశాడు.
బషీర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ హార్ట్లీ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది.
కాగా, తాజాగా ముగిసిన లార్ట్స్ టెస్ట్ టీమిండియాకు గుండెకోత మిగిల్చింది. విజయానికి అత్యంత చేరువగా వచ్చినా భారత్‌ను ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది.
ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) వీరోచితంగా పోరాడాడు. అయినా లాభం లేకుండా పోయింది.
అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.