పాక్‌ కెప్టెన్‌పై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు

Shoaib Akhtar Bizarre-Jibe At Babar Azam He Cannot Speak English Much - Sakshi

పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజంపై జట్టు మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అక్తర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. బాబర్‌కు ఇంగ్లీష్ అంత‌గా రాదని.. అందుక‌నే త‌మ దేశంలో అత‌ను బ్రాండ్ అంబాసిడర్‌ కాలేక‌పోయాడ‌ంటూ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అక్తర్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అక్తర్‌ మాట్లాడుతూ..''పాకిస్థాన్‌లో ఇంగ్లీష్ చ‌క్కగా మాట్లాడ‌గ‌ల క్రికెట‌ర్లు ఎవ‌రైనా ఉన్నారంటే?.. అది నేను, షాహిద్ ఆఫ్రిది, వ‌సీం అక్రమ్‌ మాత్రమే. అందుక‌నే మా ముగ్గురికే అన్ని వ్యాపార‌, వాణిజ్య ప్రక‌ట‌న‌లు వ‌స్తాయి. ఎందుకంటే.. మేము ఇంగ్లీష్‌ మీడియాతో మాట్లాడ‌డం అనే విష‌యాన్ని ఒక జాబ్‌గా భావించాం. ఇక క్రికెట్‌లో రాణించ‌డం ఒక ఎత్తు అయితే.. మీడియాతో మాట్లాడ‌డం, వాళ్ల ప్రశ్నల‌కు బ‌దులివ్వడం అనేది మరొక ఎత్తు. ప్రస్తుతం పాక్ జ‌ట్టులో ఉన్న ఎవ‌రూ పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడ‌లేరు. అవార్డు ప్రజెంటేష‌న్ స‌మ‌యంలో వాళ్లకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. 

బాబర్‌ ఆజం ఎప్పుడైనా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేటప్పుడు గమనించండి. హిందీ, ఇంగ్లీష్‌ మిక్స్‌ చేసి మాట్లాడడం చూస్తుంటాం. బాబ‌ర్‌కు త‌న గురించి, త‌న ఆట గురించి కూడా ఇంగ్లీష్‌లో వ‌ర్ణించ‌డం రాదు. ఒక‌వేళ అత‌ను అన‌ర్గళంగా, చక్కగా ఆంగ్లం మాట్లాడ‌గ‌లిగితే పాకిస్థాన్‌లో నంబ‌ర్ 1 బ్రాండ్ అంబాసిడ‌ర్ అయ్యేవాడు. అయినా ఇంగ్లీష్‌ నేర్చుకోవ‌డం పెద్ద క‌ష్టమైన ప‌నా?'' అని అక్తర్‌ ప్రశ్నించాడు.

ఇక పాకిస్తాన్‌ క్రికెట​లో తన ఆటతో అక్తర్‌ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అక్తర్‌ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్‌ పాకిస్తాన్‌ తరపున 46 టెస్టుల్లో 178 వికెట్లు, 163 వన్డేల్లో  247 వికెట్లు, 15 టి20 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వేగ‌వంత‌మైన బంతి వేసిన బౌల‌ర్‌గా షోయ‌బ్ అక్తర్ రికార్డు సృష్టించాడు. 2003లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో అక్తర్ గంట‌కు 161.3. కిలోమీట‌ర్ల వేగంతో బంతిని విసిరాడు. అక్తర్ త‌ర్వాత ఎంద‌రో ఫాస్ట్ బౌల‌ర్లు వ‌చ్చినప్పటికి అక్తర్‌ రికార్డు మాత్రం పదిలంగా ఉంది.

చదవండి: 'బజ్‌బాల్‌' ఎలా అడ్డుకోవాలి?.. ఫ్యాన్స్‌ను వేడుకున్న కివీస్‌ టాప్‌ వెబ్‌సైట్‌

10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top