
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా రెండు ప్రధాన తప్పిదాలు చేసిందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వాటి వల్లే ఇంగ్లండ్ 350 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగిందని అభిప్రాయపడ్డాడు.
కేఎల్ రాహుల్ పొరపాటుతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయం వల్లే ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు నిలువరించే వీలు లేకపోయిందని ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా లార్డ్స్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం మూడో టెస్టు మొదలైంది.
టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), సెంచరీ వీరుడు జో రూట్ (104)లను భారత పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా త్వరత్వరగానే పెవిలియన్ చేర్చాడు.
ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (51), టెయిలెండర్ బ్రైడన్ కార్స్ (56) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. నిజానికి జేమీ స్మిత్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు.
మరోవైపు.. రెండో రోజు ఆటలో కేవలం 63 డెలివరీలు సంధించిన తర్వాతనే బంతిని మార్చాలంటూ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పట్టుబట్టాడు. అప్పటికి బుమ్రా ఆ బంతితో బాగానే రాణిస్తున్నా.. గిల్ అంపైర్‌తో వాదనకు దిగి మరీ బంతిని మార్పించాడు. అయితే, దురదృష్టవశాత్తూ పాత బంతి కంటే అంపైర్ ఇచ్చిన కొత్త బంతి మరింత వాడినదానిలా ఉండటంతో టీమిండియాకు షాక్ తగిలింది. మొమెంటమ్ మారిపోయింది.
ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘రెండోరోజు టీమిండియా చేసిన రెండు తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేసే అవకాశం చేజారింది. కేఎల్ రాహుల్ జేమీ స్మిత్ క్యాచ్ జారవిడవడమే అన్నిటికంటే పెద్ద తప్పు. అక్కడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
స్మిత్ ఐదు పరుగుల వద్ద ఉన్నపుడు రాహుల్ క్యాచ్ మిస్ చేశాడు. ఆ తర్వాత అతడు బ్రైడన్ కార్స్‌తో కలిసి అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ గనుక అప్పుడే క్యాచ్ అందుకుని ఉంటే ఇలా జరిగేది కాదు.
ఇక రెండోది... అసలు బంతిని మార్చమని ఎందుకు అడిగారో అర్థం కాలేదు. అప్పటికే తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు తీశారు. అలాంటపుడు బంతిని మార్చాల్సిన అవసరం ఏముంది? ఆ సమయంలో.. ఒకవేళ బంతి ఆకారం మారినా దానితో పెద్దగా వచ్చే నష్టం ఏముంది?
ఓ బౌలర్‌గా చెప్తున్నా.. బంతి వల్ల మనకు ఏమాత్రం ఉపయోగం లేదనిపించినప్పుడు మాత్రమే మార్చమని అడుగుతాము. ఒకవేళ ఆ బంతి మరీ అంత చెత్తగా ఉండి ఉంటే మీకు ఉదయాన్నే మూడు వికెట్లు ఎలా దొరికేవి?.. అసలు బంతిని ఎందుకు మార్చమన్నారు?’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.