
కరీబియన్ దీవుల్లో జరుగుతున్న గ్లోబల్ సూపర్ లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ న్యూజిలాండ్‌కు చెందిన సెంట్రల్ డిస్ట్రిక్స్‌పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు.
షకీబ్ క్యాపిటల్స్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. సెంట్రల్ డిస్ట్రిక్స్‌తో మ్యాచ్‌లో షకీబ్ తొలుత బ్యాటింగ్‌లో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) చేసి, ఆతర్వాత బౌలింగ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (4-1-13-4) ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ షకీబ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. షకీబ్‌తో పాటు సెదికుల్లా అటల్ (41) కూడా రాణించాడు. నిరోషన్ డిక్వెల్లా 15, గుల్బదిన్ నైబ్ 1, కదీమ్ 3, జోర్డన్ జాన్సన్ 1, జెస్సీ బూటాన్ 20, డోమినిక్ డ్రేక్స్ 11 పరుగులు చేశారు. సెంట్రల్ డిస్ట్రిక్స్ బౌలరల్లో అంగస్ షా 3, టిక్నర్ 2, ఫాక్స్‌క్రాఫ్ట్ ఓ వికెట్ తీశారు.
అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్స్ షకీబ్ మాయాజాలం దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. క్యాపిటల్స బౌలర్లలో షకీబ్‌తో పాటు తన్వీర్ (3-0-28-2), డేక్స్ (4-0-26-1), ఆర్యమాన్ వర్మ (4-0-23-1) తలో చేయి వేశారు. సెంట్రల్ డిస్ట్రిక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ బ్రూస్ (34) టాప్ స్కోరర్‌గా నిలువగా.. డేన్ క్లీవర్ (21), విలియమ్ క్లార్క్ (20) నామమాత్రపు పరుగులు చేశారు.
వాస్తవానికి షకీబ్ ఈ టోర్నీలో రంగ్‌పూర్ రైడర్స్‌కు (బంగ్లాదేశ్) ఆడాల్సి ఉండింది. అయితే స్వదేశంలో (బంగ్లాదేశ్) అతనిపై నెలకొన్న నిషేధం కారణంగా ఇది కుదరలేదు. షకీబ్‌కు బంగ్లాదేశ్ క్రికెట్‌తో గత కొంతకాలంగా సత్సంబంధాలు లేవు. రాజకీయ అనిశ్చితి కారణంగా షకీబ్ కొద్ది నెలలుగా స్వదేశంలో అడుగుపెట్టలేదు. అలాగే అతను జాతీయ జట్టు నుంచి కూడా తప్పించబడ్డాడు. షకీబ్ బంగ్లాదేశ్‌లో ప్రతిపక్ష ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.