ఇలా అయితే వరల్డ్‌ ఎలెవెన్‌పై కూడా గెలుస్తారు.. టీమిండియాపై పాక్‌ మాజీ ప్రశంసల వర్షం | Shahid Afridi Heaps Praise On Triumphant Indian Team, Backing Them To Beat World XI | Sakshi
Sakshi News home page

ఇలా అయితే వరల్డ్‌ ఎలెవెన్‌పై కూడా గెలుస్తారు.. టీమిండియాపై పాక్‌ మాజీ ప్రశంసల వర్షం

Mar 12 2025 10:42 AM | Updated on Mar 12 2025 10:52 AM

Shahid Afridi Heaps Praise On Triumphant Indian Team, Backing Them To Beat World XI

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన టీమిండియాపై పాకిస్తాన్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది ప్రశంసల వర్షం​ కురిపించాడు. ఈ జట్టుతో భారత్‌ వరల్డ్‌ ఎలెవెన్‌పై కూడా సునాయాసంగా గెలుస్తుందని కితాబునిచ్చాడు. ఛాంపియన్స్‌గా నిలిచేందుకు టీమిండియా ఆటగాళ్లు వంద శాతం అర్హులని కొనియాడాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత సెలెక్టర్లు సరైన జట్టును ఎంపిక చేశారని అన్నాడు. వారు దుబాయ్‌లో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి స్పిన్‌ లోడ్‌తో బరిలోకి దిగారని తెలిపాడు. ఒకే వేదికపై ఆడటం భారత్‌కు కలిసొచ్చిందని అంటూనే ట్రోఫీ విజయంలో సెలెక్టర్ల పాత్ర అమోఘమని కితాబునిచ్చాడు.

దుబాయ్‌లో స్పిన్నర్ల పాత్ర చాలా కీలకమని తెలిపాడు. తనకు అ‍క్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి స్పిన్నర్ల పాత్ర గురించి తెలుసని చెప్పాడు. కేవలం స్పిన్నర్లే కాకుండా టీమిండియా మొత్తం పటిష్టంగా ఉందని అన్నాడు. ఈ జట్టుతో ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించవచ్చని తెలిపాడు.

తమ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా ఈ టోర్నీలో భారత్‌ అన్ని మ్యాచ్‌లు గెలిచిందని గుర్తు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు కలిగిన మహ్మద్‌ సిరాజ్‌ను ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేయకుండా భారత సెలెక్టర్లు సాహసోపేత నిర్ణయం​ తీసుకున్నారని అన్నాడు. 

నలుగురు స్పిన్నర్లకు ఆడించడం టీమిండియా వర్కౌట్‌ అయ్యిందని తెలిపాడు. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒకే ఒక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌తో (అబ్రార్‌ అహ్మద్‌) బరిలోకి దిగి పెద్ద తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు.

కాగా, పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ అజేయ జట్టుగా నిలిచి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌ గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లపై విజయాలు సాధించి, సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి, ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి పాకిస్తాన్‌ కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేక​ గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.  

పాక్‌ సొంతగడ్డపై ఆడుతున్న అడ్వాంటేజ్‌ను కూడా పొందలేక గ్రూప్‌ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట (న్యూజిలాండ్‌, భారత్‌ చేతుల్లో) ఓడింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దైంది. సొంతగడ్డపై డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకపోవడంతో పాక్‌కు సొంత అభిమానుల నుంచే ఛీదరింపులు ఎదురవుతున్నాయి. 

ఆ దేశ మాజీలు పాక్‌ జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లను తూర్పారబెడుతున్నారు. పాక్‌ మాజీలు పాక్‌ ఓడిపోయిన దానికంటే తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో భారత్‌ గెలిచినందుకు ఎక్కువగా బాధపడుతున్నారు. పైకి టీమిండియాను పొగుడుతున్నట్లు నటిస్తున్నప్పటికీ లోలోపల కుమిలిపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement