
సింగపూర్: భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో భాగంగా శుక్రవారం క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జంట 21–17, 21–15తో ప్రపంచ నంబర్‌వన్ జోడీ గోహ్ జీ ఫెయి–నూర్ ఇజుద్దీన్ (మలేసియా)పై గెలుపొందింది. గాయాల కారణంగా మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత జంట అదరగొడుతోంది.
క్వార్టర్స్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరల్డ్ నంబర్‌వన్ జోడీని వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. ‘ఇది పెద్ద గెలుపు. ప్రస్తుతం మేం 27వ ర్యాంక్‌లో ఉన్నాం. అగ్ర స్థానంలో ఉన్న ప్లేయర్లపై గెలవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తీవ్రత కొనసాగిస్తూ టైటిల్ అందుకోవాలనుకుంటున్నాం’ అని సాత్విక్–చిరాగ్ వెల్లడించారు.